Trump Tariffs: అగ్రరాజ్యం అమెరికాలో( America) సుంకాల ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పై పెను ప్రభావం చూపుతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపుతో పట్టు బిగుస్తున్నారు. అమెరికా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకేనని చెబుతున్నారు. అయితే ఏ దేశం పై ఎంతలా ప్రభావం ఉందో చెప్పలేం కానీ.. భారత్ పై మాత్రం పెను ప్రభావం చూపుతోంది ఈ సుంకాల విధింపు. ముఖ్యంగా ఆక్వారంగానికి చాలా దెబ్బ పడింది. ఇప్పుడిప్పుడే ఆక్వా రంగం కోలుకుంటున్న తరుణంలో ట్రంప్ సుంకం దాడి.. ఆ రంగాన్ని ఉనికి లేకుండా చేస్తోంది. ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. ఆ రంగంపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిని పడే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే దేశీయంగా తమకు మద్దతు ధరతో పాటు మార్కెట్ సదుపాయం కల్పించాలని ఆక్వారైతులు కోరుతున్నారు.
* ఆహార ఉత్పత్తులపై పన్నులు..
అమెరికాలో ట్రంప్ ( American President Donald Trump)సుంకాల పెంపు నేపథ్యంలో ఆహార ఉత్పత్తులపై భారీగా పన్ను పెరుగుతోంది. ఇప్పటివరకు మూడు నుంచి నాలుగు శాతం మాత్రమే పన్ను ఉండేది. ట్రంప్ పన్నుల పెంపులో భాగంగా.. 26 శాతానికి పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎగుమతులపై తీరని ప్రభావం తప్పదు. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ఎగుమతికి సంబంధించి ఏపీ నుంచి అమెరికాకు రొయ్యలు వెళ్లేవి. అయితే ఒకవేళ పనులు పెరిగితే మాత్రం.. లక్ష రూపాయల విలువ చేసే రొయ్యలు అమెరికాకు తరలిస్తే 26 వేల రూపాయలు పన్నుల రూపంలో కట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే… ఏపీలో ఆక్వారంగం సంక్షోభంలో పడినట్టే.
* సుదీర్ఘ తీర ప్రాంతం..
ఏపీలో( Andhra Pradesh) సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉంది. తిరుపతి జిల్లా తడ నుంచి.. ఇచ్చాపురం జిల్లా డుంకూరు వరకు విస్తరించి ఉంది. 12 తీర జిల్లాలు ఉన్నాయి. సముద్రంలో చేపల వేట తో పాటు తీర ప్రాంతంలో చెరువులు సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధానంగా ఏపీలో ఆక్వా రంగంలో సాగు చేసి రొయ్యలు అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాదిమంది ఆధారపడి బతుకుతున్నారు. మరోవైపు ఈ రొయ్యల ఎగుమతి దారులు సైతం ఉంటారు. ఇప్పటివరకు ఈ రొయ్యల ఎగుమతి అనేది సాఫీగా జరుగుతూ వచ్చింది. కానీ ట్రంప్ సుంకాల పుణ్యమా అని పతనం అంచున నిలబడింది. అక్కడ పన్నులు పెరగడంతో పాటు ఇతరత్రా ఖర్చులు పెరగడంతో ఆక్వా రైతుల వద్ద రొయ్యల ధరను తక్కువ చేసి అడుగుతున్నారు. దీంతో ఇప్పటికే ఈ రంగం లో నిర్వహణ కష్టతరంగా మారుతున్న తరుణంలో.. ఈ ధర తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
* కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం..
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వారంగానికి ఎనలేని ప్రాధాన్యత పెరిగింది. ఆ రంగానికి ప్రోత్సాహం అందించేలా రాయితీలు, ఇతరత్రా వసతులు పెంచాలని సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. యూనిట్ విద్యుత్తును రూ.1.50 పైసలకే అందించాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. దీంతో గతంలో వివిధ కారణాలతో చేపల చెరువు సాగును నిలిపివేసిన చాలామంది నిర్వాహకులు.. మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలోనే ట్రంప్ సుంకాల నిర్ణయం ఆక్వారంగాన్ని ఆలోచనలో పడేసింది. వారంతా వెనక్కి తగ్గాల్సి వస్తోంది.