Elon Musk: ఎక్స్.. గతంలో ట్విట్టర్.. సోషల్ మీడియాలో(Social Media) ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న యాప్ ఇది. ట్విట్టర్(Twitter)కు ఉన్న ఆదరణ చూసే.. దీనిని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ 2022లో కొనుగోలు చేశాడు. తర్వాత ట్విట్టర్ పేరు తొలగించి ఎక్స్ గా పేరుపెట్టాడు. తర్వాత ట్విట్టర్ పిట్టను తొలగించాడు. ఇటీవలే దీనిని రూ.32 లక్షలకు విక్రయించాడు.
Also Read: 1.1 లక్షల గంటలు.. భారతీయు ల ఫోన్ మోజుకు తార్కాణమిదీ
ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్ ఎలాన్ మస్క్(Elan Musk) మరో కీలక నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ’ఎక్స్’ను విక్రయించినట్లు ప్రకటించారు. అయితే, ఈ విక్రయం బయటి వ్యక్తులకు కాదు, మస్క్ స్వంత కృత్రిమ మేధ (AI) సంస్థ ’ఎక్స్‌ఏఐ’ (x AI) జరిగింది. ఈ విషయాన్ని మస్క్ ’ఎక్స్’లో ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. 33 బిలియన్ డాలర్లకు ’ఎక్స్’ను ’ఎక్స్‌ఎఐ’కి అమ్మినట్లు తెలిపారు. తాజా అంచనాల ప్రకారం, ’ఎక్స్‌ఏఐ’ విలువ 80 బిలియన్ డాలర్లుగా నిర్ధారణ జరిగింది. ’ఎక్స్’ను ’ఎక్స్‌ఏఐ’తో అనుసంధానం చేయడం ద్వారా అధునాతన ఏఐ సామర్థ్యాలతో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని మస్క్ పేర్కొన్నారు.
2022లో కొనుగోలు..
2022లో ’ట్విటర్’ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మస్క్, దాని పేరును ’ఎక్స్’గా మార్చారు. అనంతరం సిబ్బంది తొలగింపు, ద్వేషపూరిత ప్రసంగాల వివాదాలతో ’ఎక్స్’ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ’ఎక్స్’ను ’ఎక్స్‌ఏఐ’కి విక్రయించడం ద్వారా మస్క్ తన వ్యూహాత్మక దృష్టిని మరోసారి చాటారు. గతేడాది చాట్‌జీపీటీకి పోటీగా ’ఎక్స్‌ఏఐ’ని ప్రారంభించిన మస్క్, ఈ రెండు సంస్థలను ఒకదానితో ఒకటి ముడిపడేలా చేస్తున్నారు. ‘డేటా మోడల్స్ అనుసంధానంతో మరింత ఉన్నత ఫలితాలు సాధిస్తాం. ’ఎక్స్‌ఏఐ’ సామర్థ్యం ’ఎక్స్’ పరిధిని విస్తరిస్తుంది‘ అని మస్క్ తన పోస్టులో వివరించారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవోగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్న మస్క్ ఈ నిర్ణయంతో మరోసారి దృష్టిని ఆకర్షించారు. ’ఎక్స్’ మరియు ’ఎక్స్‌ఏఐ’ కలయిక కోట్లాది మంది వినియోగదారులకు అత్యద్భుత అనుభవాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విక్రయం ’ఎక్స్’ భవిష్యత్తును ఏఐ సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంగా చూడవచ్చు. మస్క్ వ్యాపార వ్యూహం మరోసారి సాంకేతిక ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.