Anil Ambani : అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్ లిమిటెడ్. రిలయన్స్ న్యూ సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) వేలంలో బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో 930 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును గెలుచుకుంది. ఈ సోలార్ ప్రాజెక్టుల వేలం డిసెంబర్ 9, 2024న జరిగింది. రిలయన్స్ న్యూ సన్‌టెక్ 17వ రౌండ్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) వేలంలో యూనిట్‌కు (kWh) రూ. 3.53 చొప్పున సక్సెస్ ఫుల్ బిడ్‌ను వేసింది. రిలయన్స్ పవర్ బుధవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ సన్‌టెక్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) వేలంలో 1,860 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థతో 930 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను గెలుచుకుంది. ఇది దేశంలోనే సోలార్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్.
టెండర్ నిబంధనల ప్రకారం.. రిలయన్స్ న్యూ సన్‌టెక్ సోలార్ ప్రాజెక్ట్‌తో పాటు 465మెగా వాట్స్ కెపాసిటీతో కనీస నిల్వ వ్యవస్థను కూడా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)నుండి ప్రాజెక్ట్ కోసం కంపెనీకి ఇంకా కేటాయింపు లేఖ రాలేదు. రిలయన్స్ న్యూ సన్‌టెక్ 1,000 మెగావాట్స్ శక్తి నిల్వ వ్యవస్థతో ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ISTS)తో అనుసంధానించబడిన 2,000 మెగా వాట్స్ సామర్థ్యం గల ప్రాజెక్ట్‌ల కోసం వేలంలో ఉన్న ఐదు కంపెనీలలో అతిపెద్ద ఏకైక ప్రాజెక్ట్‌ను పొందింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) 25 సంవత్సరాల కాలానికి రిలయన్స్ న్యూ సన్‌టెక్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) కుదుర్చుకుంటుంది. కొనుగోలు చేసిన సౌర విద్యుత్‌ను దేశంలోని పంపిణీ సంస్థలకు విక్రయిస్తారు. రిలయన్స్ న్యూ సన్‌టెక్ ఈ ప్రాజెక్ట్‌ను బిల్డ్, ఓన్, ఆపరేట్ (BOO) ఆధారంగా అభివృద్ధి చేస్తుంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ ఇంటర్‌స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ISTS)కి ప్రాజెక్ట్‌లను కనెక్ట్ చేసే నిబంధనల ప్రకారం కంపెనీ ప్రాజెక్ట్‌ను ISTSకి అనుసంధానిస్తుంది.
రిలయన్స్ పవర్ లిమిటెడ్, రిలయన్స్ గ్రూప్ యూనిట్. ఇది దేశంలోని ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలలో ఒకటి. సంస్థ స్థాపిత సామర్థ్యం 5,300 మెగావాట్లు. ఇందులో మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తున్న 3,960 మెగావాట్ల సాసన్ మెగా పవర్ ప్రాజెక్ట్ కూడా ఉంది. దేశంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)నోడల్ ఏజెన్సీ.