దేశంలోని కోట్ల సంఖ్యలో ప్రజలు పాన్ కార్డును కలిగి ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో పాన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నట్టు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని చోట్ల మనకు తెలియకుండానే పాన్ కార్డ్ వివరాలను అందజేస్తుండగా రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. తాజాగా రిక్షా తొక్కే కార్మికుడికి 3 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలంటూ ఐటీ నోటీసులు జారీ అయ్యాయి.
ఆ వ్యక్తి తన సంపాదన రోజుకు 500 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉండదని తనకు ఐటీ నోటీసులు రావడం ఏమిటని ఆవేదనను వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు రిక్షా తొక్కే కార్మికుడి పాన్ కార్డును ఉపయోగించుకుని సంవత్సర కాలంలో ఏకంగా 43 కోట్ల రూపాయల వ్యాపారం చేశారు. గతంలో పలువురు సెలబ్రిటీలకు సైతం ఇలాంటి చేదు అనుభవాలే ఎదురు కావడం గమనార్హం.
ప్రతిరోజూ ఇలాంటి మోసాలు పదుల సంఖ్యలో జరుగుతున్న నేపథ్యంలో పాన్ కార్డ్ వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. అవసరమైన చోట పాన్ కార్డు వివరాలను చెప్పకపోతే ముఖ్యమైన సమాచారంను దాచిపెడుతున్నామని ఐటీ శాఖ అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పాన్ నంబర్ తెలిస్తే ఆ నంబర్ సహాయంతో కొంతమంది ఇతర వివరాలను కూడా సులభంగా సేకరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప పాన్ నంబర్ ను బయటకు చెప్పకూడదు. పాన్ కార్డ్ జిరాక్స్ పై సంతకం చేస్తే తేదీ తప్పనిసరిగా వేయాలి. పాన్ కార్డు కనిపించకపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే మంచిది.