https://oktelugu.com/

Top 10 Richest Indians: దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అదానీ.. మళ్లీ ఎలా అవతరించాడు?

గౌతమ్‌ అదానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గతేడాది నుంచి ఆయన దేశవాప్తంగా చర్చల్లో ఉంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపర్చారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 5, 2024 / 04:52 PM IST

    Top 10 Richest Indians

    Follow us on

    Top 10 Richest Indians: భారతీయ ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ మళ్లీ భారతీయ సంపన్నుడిగా నిలిచారు. ముకేశ్‌ అంబానీని వెనక్కు నెట్టి.. మొదటి స్థానాన్ని ఆయన నుంచి లాక్కున్నారు. హిండెన్‌ బర్గ్‌ కేసుపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు రికార్డు స్థాయిలో పరుగులు పెడుతున్నాయి. దీంతో ఆయన సంపద అమాంతం పెరిగింది.

    ఒడిదుడుకులను దాటి..
    గౌతమ్‌ అదానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. గతేడాది నుంచి ఆయన దేశవాప్తంగా చర్చల్లో ఉంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపర్చారు. అయితే ఎంత వేగంగా ఎదిగారో.. అంతే వేగంగా పడిపోయారు. ఆటంకాలను అదిగమించుకుంటూ వస్తున్న అదాని మళ్లీ పుంజుకుంటున్నారు. తాజాగా బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో భారత్‌ లోనే అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ఆ స్థానంలో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీని వెనక్కు నెట్టిన అదానీ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నారు.

    ప్రపంచ జాబితాలో 12 ర్యాంకు..
    మరోవైపు గౌతమ్‌ అదాని సంపద ఇటీవల భారీగా పెరుగుతోంది. దీంతో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ పుంజుకుంటున్నారు. ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నారు. తర్వాత ముఖేశ్‌ అంబానీ 13 ర్యాంకులో ఉన్నారు. గతేడాది నుంచి చూస్తే ఇద్దరూ వరల్డ్‌ రిచ్‌ లిస్ట్‌లో తమ స్థానాలను మెరుగు పరుచుకుంటూ వస్తున్నారు. గతేడాది అదానీ గ్రూప్‌ చైర్మన్‌ 15వ స్థానంలో ఉండగా తాజాగా 12వ స్థానానికి చేరుకున్నారు. అంబానీ గతేడాది 14వ స్థానంలో ఉండగా, ఈసారి 13వ స్థానంలో నిలిచారు.

    హిండెన్‌ బర్గ్‌ ఆరోపణలతో అల్లకల్లోలం..
    అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ 2023 జనవరిలో గౌతమ్‌ అదానీ సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేసింది. స్టాక్‌ మానిఫ్యులేషన్, అకౌంట్లలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించింది. వాటిని అదానీ గ్రూప్‌ కొట్టిపారేసింది. అయినా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ భారీగా పతనమయ్యాయి. దీంతో అదానీ వ్యక్తిగత సంపద ఆవిరైంది. దాదాపు 60 శాతం ఆదాయం పడిపోయింది. 69 బిలియన్‌ డాలర్లస్థాయికి దిగజారింది. దీంతోపాటు దేశంలో, ప్రపంచంలో సంపన్నుల జాబితాలో ఉన్న ర్యాంకులు కోల్పోయారు.

    సుప్రీం తీర్పుతో జూమ్‌..
    అదానిపై వచ్చిన ఆరోపణలపై కొద్ది రోజుల క్రితం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ సంస్థపై విదేశీ సంస్థల ఆరోపణలను, మీడియాలో వచ్చిన కథనాలను పరిగణనలోకి తీసుకోలేమని ప్రకటించింది. ఈ వ్యాఖ్యలు అదానీ గ్రూప్‌లో పెట్టుబడిదారులకు పెద్ద ఊరటనిచ్చాయి. కంపెనీకి బలం వచ్చింది. వారం క్రితం కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెల రోజుల్లో హిండెన్‌బర్గ్‌ కేసుపై విచారణ పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. దీంతో ఆరోపణలు అవాస్తవమని తేలుతుండడం, మరోవైపు న్యాయస్థానం అదానీ గ్రూప్‌పై చేసిన వ్యాఖ్యలు పాజిటివ్‌గా ఉండడంతో గ్రూప్‌ కంపెనీల షేర్లు పుంజుకుంటున్నాయి. దీంతో మళ్లీ అదానీ సంపద భారీగా పెరుగుతోంది.