VV Vinayak
VV Vinayak: వైసిపి సెలబ్రిటీలపై దృష్టి సారించింది. వివిధ రంగాల్లో ప్రముఖంగా ఉన్న వ్యక్తులను గుర్తించి పార్టీలోకి రప్పించాలని చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా కాపు సెలబ్రిటీలపై దృష్టి పెట్టింది. పవన్ వెంట కాపులు వెళ్తుండడంతో.. ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోకూడదని భావిస్తోంది. కాపు ప్రముఖులను టార్గెట్ చేసుకొని పావులు కదుపుతోంది.
ఇప్పటికే యంగ్ క్రికెటర్ అంబటి రాయుడును వైసీపీలోకి చేర్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ స్థానం నుంచి రాయుడును పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాపు ఉద్యమ మాజీ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక దాదాపు ఖరారు అయ్యింది. ఆయన కానీ.. ఆయన కుమారుడు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ముద్రగడ చేరికతో కాపు సామాజిక వర్గాన్ని పవన్ వైపు వెళ్లకుండా కొంత నియంత్రించవచ్చని జగన్ భావిస్తున్నారు.
వంగవీటి మోహన్ రంగా తనయుడు రాధాకృష్ణపై కూడా వైసిపి ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు గురించి రాధాకృష్ణ పట్టుబట్టారు. కానీ వైసీపీ హై కమాండ్ మల్లాది విష్ణుకు కేటాయించింది. దీంతో తీవ్ర మనస్తాపంతో ఆయన టిడిపిలో చేరారు. అయితే ఈసారి వైసీపీలోకి వస్తే విజయవాడ సెంట్రల్ స్థానాన్ని కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మొన్న ఆ మధ్యన మిధున్ రెడ్డి రాధాకృష్ణతో చర్చలు జరిపినట్లు సమాచారం. కానీ రాధాకృష్ణ నుంచి ఎటువంటి సమ్మతి రాలేదు. వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసును నియమించారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ పై వైసిపి ఫోకస్ పెట్టింది. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కారణం. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు కు చెందిన వినాయక్ తెలుగు స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. సమకాలిన రాజకీయ అంశాలపై ఆయనకు అవగాహన ఉంది. ఒకటి, రెండు సార్లు జగన్ కు అనుకూలంగా మాట్లాడారు. గత ఎన్నికల్లో నిడదవోలు అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ తరఫున వినాయక్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో అది జరగలేదు. ఈసారి మాత్రం కచ్చితంగా పోటీ చేయాలని ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. అయితే వీవీ వినాయక్ స్వతహాగా చిరంజీవి అభిమాని. మెగా కాంపౌండ్ వాల్ కు దగ్గరగా ఉంటారు. అందుకే ఆయన వైసీపీలో చేరుతారా? లేదా? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఒకవేళ ఆయన అంగీకరిస్తే ఏలూరు నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ పార్లమెంటు స్థానానికి పోటీ చేయించే అవకాశం ఉంది. మరి వివి వినాయక్ మనసులో ఏముందో చూడాలి.