5 New Scooters: 2025లో సగం సంవత్సరం గడిచిపోయింది. టూ వీలర్ మార్కెట్లో ఇంకా ఎన్నో ఆవిష్కరణలకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చాలా కంపెనీలు కొత్త స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి రెడీ అయ్యాయి. వీటిలో ఎలక్ట్రిక్ (EV), పెట్రోల్ మోడళ్లు రెండూ ఉన్నాయి. హోండా నుంచి టీవీఎస్ వరకు కొత్త స్కూటర్లపై పని చేస్తున్న కంపెనీల్లో ఉన్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే యాక్టివా, జూపిటర్ వంటి పాపులర్ మోడళ్లను మార్కెట్లో అమ్ముతున్నాయి.
బజాజ్ ఆటో
బజాజ్ త్వరలో తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ చవకైన వెర్షన్‌ను విడుదల చేయనుంది. చేతక్ 2903 అనే ఎంట్రీ-లెవల్ మోడల్ జూన్ లో వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 3.5 kWh బ్యాటరీ ఉంటుంది. ఇది 153 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఈ స్కూటర్‌లో 35 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్, గంటకు 63 కిలోమీటర్ల స్పీడ్, రెండు రైడింగ్ మోడ్‌లు (ఎకో, స్పోర్ట్) లభిస్తాయి. దీన్ని 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 25 నిమిషాలు పడుతుంది.
టీవీఎస్ మోటార్
చాలా కాలంగా టీవీఎస్ (TVS) తమ స్పోర్టీ స్కూటర్ ఎన్టార్క్‌లో మరింత పవర్ ఫుల్ 150సీసీ ఇంజిన్‌ను తీసుకురావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌లో ప్రస్తుతం తక్కువ స్కూటర్లు ఉన్నాయి. కానీ టీవీఎస్ ఎంట్రీతో పోటీ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఎన్ టార్క్ 150 కొత్త ఇంజిన్‌తో విడుదల కానుంది. ఇది అప్రిలియా ఎస్‌ఎక్స్ఆర్ 160, హీరో జూమ్ 160, యమహా ఏరాక్స్ 155 లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా
సుజుకి భారతదేశంలో తన మొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ-యాక్సెస్ను త్వరలో విడుదల చేయనుంది. ఇందులో 3.07 kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఇది 95 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుంది. 4.1 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో ఇది 15ఎన్ఎం టార్క్, గంటకు 71 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకుంటుంది. ఇందులో మూడు డ్రైవ్ మోడ్‌లు – ఎకో, రైడ్ A, రైడ్ B ఇస్తుంది కంపెనీ.
హీరో విడా
హీరో మోటోకార్ప్ తదుపరి స్కూటర్ వీఎక్స్2 కానుంది. దీనిని బడ్జెట్ సెగ్మెంట్ కోసం తీసుకురావచ్చు. కంపెనీ ఇంకా దీని స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు. కానీ విడా ప్రస్తుత సిరీసులో 2.2 kWh, 3.4 kWh, 3.9 kWh బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం విడా వి2 మూడు వేరియంట్‌లలో లైట్, ప్లస్, ప్రో లభిస్తుంది, దీని ధర రూ.74,000 నుండి రూ.1,20,300 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
యాక్టివా కొత్త వెర్షన్!
స్కూటర్ సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న హోండా, తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ యాక్టివా కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇందులో కొత్త డిజైన్, ఎల్‌ఈడి ఇండికేటర్లు, టెయిల్ ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ముఖ్యమైన అప్‌డేట్‌లు లభించవచ్చు. దీని డిజైన్ పెద్దగా మారనప్పటికీ కొన్ని మార్పులు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాయి. దీనిని పండుగ సీజన్‌లో విడుదల చేయవచ్చు. ఈ కొత్త స్కూటర్లు భారతీయ టూ వీలర్ మార్కెట్‌లో కొత్త జోష్‌ను తీసుకువస్తాయని అంచనా.