Amazon Layoffs: ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు పరిస్థితులు మారిపోతున్నాయి. యుద్ధాలు.. దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. వీటివల్ల కొనుగోలు, అమ్మకాలు, అవసరాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో సేవా రంగం కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఐటీ సర్వీసులు సేవా రంగం కిందికే వస్తాయి. మార్కెట్ లో ఏవైనా అననూకూల పరిస్థితులు ఏర్పడితే కంపెనీలు మరో మాటకు తావు లేకుండా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐటీ పరిభాషలో దీనిని లే ఆఫ్ పిలుస్తుంటారు.
Also Read: లోక్ సభ, అసెంబ్లీ నియోజక వర్గాలు జిల్లాల స్వరూపాన్ని ఎందుకు నిర్ణయించలేవు?
లే ఆఫ్ అనే విధానం ఇటీవల అందుబాటులో వచ్చింది కాదు. 1993లోనే ఈ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 1993లో ప్రఖ్యాత ఐబీఎం కంపెనీ ఏకంగా 60,000 మంది ఉద్యోగులను అత్యంత దారుణంగా బయటికి పంపించింది. ఐటీ చరిత్రలో ఇది అతి పెద్ద తొలగింపుగా పేర్కొంటుంటారు. నాటి రోజుల్లో ఉద్యోగులు సంస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా చేశారు. అయినప్పటికీ ఐబీఎం సంస్థ వెనక్కి తగ్గలేదు.
2008 -09 కాలంలో ప్రఖ్యాతమైన సిటీ బ్యాంక్ 75,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక అస్థిరత్వం కారణంగా ఆ కంపెనీ ఉద్యోగులను బయటకు పంపించింది.
2009 సంవత్సరంలో జనరల్ మోటార్స్ సంస్థ 47,000 మంది ఉద్యోగులను తొలగించింది. వాస్తవానికి ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి. వేల కోట్ల ఆదాయం ఉంది. అయినప్పటికీ ఆర్థికంగా ఇబ్బంది కావడంతో ఉద్యోగులను పక్కనపెట్టింది.
2012-15 సంవత్సరాల మధ్య కాలంలో ప్రఖ్యాత కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్ పీ 55,000 మంది ఉద్యోగులను తొలగించింది. అమ్మకాలు లేకపోవడంతో.. తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు అప్పట్లో ఆ సంస్థ వెల్లడించింది.
2020 సంవత్సరంలో ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ బోయింగ్ ఏకంగా 30 వేల మంది ఉద్యోగులను పక్కనపెట్టింది. అస్థిరత వల్ల.. ఆర్థికంగా ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ అప్పట్లో పేర్కొంది.
2022 -23 కాలంలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా ఇరవై వేల మంది ఉద్యోగులను పక్కనపెట్టి.. కరోనా.. ఆ తర్వాత పరిణామాల వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించినట్లు ఆ సంస్థ పేర్కొంది.
2022 -23 సంవత్సరానికి సంబంధించి ఆమెజాన్ కంపెనీ 27000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా 14000 మందిని పక్కన పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన అస్థిరమైన వాతావరణం.. ఇతర పరిస్థితులు ఈ నిర్ణయానికి కారణమయ్యాయని అమెజాన్ సంస్థ ప్రకటించింది.
అయితే ఈ వివరాలు పరిశ్రమ వర్గాల ద్వారా.. వివిధ మార్గాల ద్వారా సేకరించినవి. తొలగించిన ఉద్యోగుల సంఖ్యలో కాస్త తేడాలు ఉండవచ్చు.