BRS
BRS: ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అనే సామెత తెలంగాణలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) విషయంలో నూటికి నూరుపాళ్లు నిజమవుతోంది. తెలంగాణ ఉద్యమ పార్టీగా ఇక్కడి ప్రజలు ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారు. రెండు దశాబ్దాలపాటు ఆదరించారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో బాగానే ఉన్న నేతలు అధికారంలోకి వచ్చాక మారిపోయారు. కేసీఆర్ సార్ అయితే పూర్తిగా మారిపోయారు. తెలంగాణ ప్రజలను మరిచారు. నిరుద్యోగులను గాలికి వదిలేశారు. ఇక రాచరిక పాలనకు తెర తీశారు. తాము ఎంత చెబితే అంత అన్నట్లు వ్యవహరించారు. తమను ప్రశ్నించేవాడు ఉండొద్దని ప్రతిపక్షం లేకుండా చేశారు. తెలంగాణలో 2014లో గెలిచినప్పుడు కాంగ్రెస్, టీ డీపీ, చివరకు కమ్యూనిట్లు ఎమ్మెల్యేను కూడా బీఆర్ఎస్లో కలుపుకున్నారు. 2018లో గెలిచిన తర్వాత కూడా అదే విధానం అవలంబించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఫిరాయింపులనే ఎక్కువగా ప్రోత్సహించారు. అవసరం లేకున్నా ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.
ఓటమితో ఉనికే ప్రశ్నార్థకం..
పదేళ్లు కేసీఆర్ తీరును పరిశీలిస్తూ వచ్చిన తెలంగాణ ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు అస్త్రంతో ఇంటికి పంపించారు. కేసీఆర్ భాషలో చెప్పాలంటే.. ఫిరాయింపులను ప్రోత్సహించిన గులాబీ పార్టీని చీరి చింతకు కట్టారు. కేవలం 39 ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు. దీంతో మొన్నటి వరకు వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఒకవైపు పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ సమయంలో గులాబీ నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఇది పార్టీ అధినేతను ఆందోళనకు గురిచేస్తోంది. నిన్న మొన్నటి వరకు బలం, బలగం అనుకున్న నాయకులే ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు.
సిట్టింగ్ ఎంపీలు జంప్..
బీఆర్ఎస్కు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ.పాటిల్ బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గొడెం నగేశ్ బీజేపీలో చేరారు. దీంతో గులాబీ బాస్‌కు ఊహించని షాక్ తగిలింది.
నేతల మౌనం..
పదేళ్లు పార్టీలో ఉండి పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నా… అధినే కేసీఆర్, వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీశ్‌రావు నోరు మెదపడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు తాము వద్దనుకున్న వాళ్లే పార్టీ వీడుతున్నారని అహంకారపు మాటలు మాట్లాడారు. ఇప్పుడు మాత్రం మౌనం పాటిస్తున్నారు. పార్టీ మారుతున్నవారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు.
మనుగడకే ముప్పు..
మారుతున్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ మనుగడకే ముప్పు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, సీతారాంనాయక్ వంటి సీనియర్లు పార్టీ వీడడంతో ఆ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులే కరువయ్యారు. 17 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో బీఎస్పీతో పొత్తుకు దిగజారిపోయారు గులాబీ బాస్. మరి ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Big shock for brs party former mps and mlas joined bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com