AP Ration Rice: వైసీపీ ప్రభుత్వానివి ఆది నుంచి అనాలోచిత నిర్ణయాలే. అప్పటి వరకూ పాలించిన ప్రభుత్వాల ముద్ర తొలగించేందుకు తహతహలాడి వ్యవస్థాగతమైన లోపాలతో పాలన సాగిస్తోంది. ఇందుకు పౌరసరఫరాల వ్యవస్థే చక్కటి ఉదాహరణ. కోట్లాది రూపాయల అడ్డూ అదుపు లేని ఖర్చుతో పౌరసరఫరాల శాఖను ఖరీదైన వ్యవస్థగా తయారుచేశారు. ఇప్పుడు ఆ భారం నుంచి అధిగమించేందుకు తెరపైకి ‘నగదు బదిలీ’ పథకాన్ని తీసుకొచ్చారు. బియ్యం అవసరం లేకుంటే కిలోకు రూ.10 నుంచి రూ.12ల వరకూ ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇప్పటికే దీనిపై గ్రామాల్లో వలంటీర్లు ప్రచారం చేస్తున్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు.
వారితో అంగీకార పత్రాలు తీసుకుంటున్నారు. అయితే ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే గ్యాస్ పంపిణీలో నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ ఏమంత ప్రయోజనం కనిపించలేదు. బ్యాంకు ఖాతాల్లో అరకొరగానే రాయితీ మొత్తం జమ అవుతోంది. ఈ పరిస్థితుల్లో నగదు బదిలీ పథకం అంటేనే లబ్ధిదారులు హడలెత్తిపోతున్నారు. రేషన్ కార్డులు రద్దవుతాయన్న భయం వారిని వెంటాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఎక్కువ మంది అప నమ్మకంతో ఉన్నారు. అందుకే పౌర సరఫరాల వ్యవస్థలో నగదు బదిలీపై అంతటా విముఖత వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రేషన్ పంపిణీలో సమూల మార్పులు తీసుకొచ్చారు. లబ్ధిదారులకు సన్న బియ్యం అందించనున్నట్టు ప్రకటించారు. తొలుత వంటీర్లతో ఇంటింటా రేషన్ పంపిణీ చేశారు. తరువాత ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఇందుకు వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు నగదు బదిలీ పథకం ప్రారంభిస్తుండడంతో ఈ వాహనాల పరిస్థితి ఏమిటన్నది తెలియడం లేదు.
Also Read: Telangana Politics: తెలంగాణలో వేడెక్కుతున్న రాజకీయాలు.. వ్యూహ ప్రతివ్యూహాల్లో పార్టీలు
భారం అధిగమించేందుకే..
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆహారభద్రత చట్టంతో నష్టం తప్పదని.. రాష్ట్ర ప్రభుత్వంపై భారం తప్పదని సీఎం జగన్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ రాష్ట్రంలో సగం మంది లబ్ధిదారులకు అందించే పరిస్థితులు లేవని గుర్తించారు. ఆహార భద్రత చట్టం మార్గదర్శకాలు చూసి హడలెత్తిపోయారు. ఇలానే కొనసాగితే పౌరసరఫరాల వ్యవస్థతో పుట్టి మునగడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఎంచక్కా రేషన్ డిపోల వద్ద నేరుగా లబ్ధిదారులు సరుకులు తీసుకునేవారని.. కానీ గొప్పకు పోయి జగన్ సర్కారు కోరి కష్టాలు తెచ్చుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలుత వలంటీర్లతో ఇంటింటా సరఫరా చేశారు. తరువాత వాహనాలను ఏర్పాటు చేశారు.
వారికి రూ.21,000 వేతనంగా నిర్ణయించారు. పోనీ ఇంతా ఖర్చుచేసినా లబ్ధిదారులకు కేవలం బియ్యం, పంచదార మాత్రమే అందించగలుగుతున్నారు. గత ప్రభుత్వాల హయాంలో రేషన్ లో బియ్యంతో పాటు 12 రకరాల సరుకులు అందించేవారు. కానీ వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక నాణ్యమైన, సన్న బియ్యం పేరిట మిగతా వస్తువులను సైతం నిలిపివేసింది. నెలనెలా డీలర్లు డీడీలు కట్టి రేషన్ విడిపిస్తారు. గోదాముల నుంచి డిపోలకు బియ్యం తెస్తే.. అక్కడ నుంచి వాహనాల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు తీసుకెళ్లి అందిస్తున్నారు. అయితే లబ్ధిదారులు మాత్రం పాత పద్ధతే మంచిదని అభిప్రాయపడుతున్నారు. అప్పట్టో 12 రకాల సరుకులతో పాటు డీలరు వద్ద నేరుగా సరుకులు తీసుకునేవారు. 15 రోజుల వరకూ సరుకులు విడుదల చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వాహనాలు నిర్థిష్ట సమయానికి పలానా చోట నిలపనున్నట్టు సమాచారమిస్తున్నారు. ఆ సమయం దాటితే దొరకని పరిస్థితి.
లబ్ధిదారుల్లో అనుమానాలు
వలంటీర్లు నగదు బదిలీ పథకంపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. తమకు బియ్యం వద్దని.. నగదే కావాలని అడుగుతున్న వారి కార్డులు రద్దు చేయడానికే వలంటీర్లు సర్వే చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నగదుకుగాని టిక్ పెడితే వీరు ఇన్నాళ్లూ సరుకులు అమ్ముకున్నారని భావించే ప్రమాదముందంటున్నారు. అందుకే కొందరు నగదు బదిలీపై మొగ్గుచూపుతున్నా ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ జాతీయ ఆహార భద్రతా చట్టం అమలవుతున్న కార్డుదారులు నగదు బదిలీలోకి రావాలంటే ఆ పథకం నుంచి బయటకు రావాల్సి ఉంది. తొలిదశలో ప్రయోగాత్మకంగా పట్టణ ప్రాంతాలైన విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల మున్సిపాలిటీల్లో అమలు చేయనున్నారు.
నిరుపేదలకు రేషన్‌కు బదులుగా కేజీని రూ. పది నుంచి రూ. పన్నెండు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం సన్న బియ్యం.. రేషన్ బియ్యం అని రకరకాల కారణాలు చెబుతోంది. ఇప్పుడు మార్కెట్లో ఎలాంటి బియ్యం అయినా రూ .40కు తక్కువ లేవు. ప్రభుత్వం మరీ పది రూపాయలే ఇస్తామనడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. అదే సమయంలో పేదలు తమకు బియ్యం ద్వారా వచ్చిన నగదును మద్యానికి ఖర్చు చేసే ప్రమాదం ఉంది . ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు కోసం ఇలా చేస్తున్నా.. ఇది పేదలను మరింత కష్టాల్లోకి నెడుతుందన్న అభిప్రాయంలో ఉన్నారు. మరో వైపు ఇంటింటికి రేషన్ బదిలీ పేరుతో వందల కోట్లు పెట్టి వాహనాలు కొనుగోలు చేసి.. వాటికి ఆపరేటర్లను నియమించి హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు నగదు బదిలీ కి నిర్ణయించడంతో వారినేం చేస్తారన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది.
Also Read:Karnataka Minister Eshwarappa : కర్ణాటక అవినీతి కంపు బీజేపీని దహించేస్తోందా?
Web Title: Ap govt decided to transfer cash to cardholders who do not want ration rice
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com