YSR Congress Party: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. నెక్స్ట్ మేమే అంటూ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ఇదే మాట చెబుతున్నారు. కానీ ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రం ప్రశ్నించే నేతలు కరువవుతున్నారు. ఒకరిద్దరు నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. విశాఖలో ఏదైనా పరిణామం జరిగితే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారు. మిడిల్ ఆంధ్రాలో ఏదైనా జరిగితే అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాయలసీమలో ఏమైనా జరిగితే నెల్లూరు జిల్లాకు చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా ముందుకు వస్తున్నారు. మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలపై స్పందిస్తున్నారు. వారికి మించి ఎవరు ముందుకు రావడం లేదు. నిజంగా ఇది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లోటు. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో డీజిల్ అంశంపై పోరాటం చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రధాన నేతలు ఎవరు దీనికి హాజరు కాలేదు. పేరు మోసిన నాయకులు కనిపించలేదు. వారంతా వీకెండ్ కామెంట్స్ అన్నట్టు వారంలో ఒకసారి మీడియా ముందుకు వచ్చి మళ్లీ సైలెంట్ అవుతున్నారు.
* విదేశీ పర్యటనలో అధినేత..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. కుటుంబంతో సహా ఆయన మే 15 వరకు విదేశీ పర్యటనలోనే ఉంటారు. ఇంతలో రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడింది. దీనిపై ఆందోళనలు చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే ఒకటి రెండు చోట్ల మాత్రమే సీరియస్ గా దీనిపై ఆందోళన జరిగింది. చాలాచోట్ల తూతూ మంత్రంగా ముగించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు ఆ పార్టీకి డ్యామేజ్ చేశాయి. దీనిపై ముందుగానే మేల్కొన్నారు చంద్రబాబుతో పాటు లోకేష్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా సృష్టించిన వివాదం అంటూ తిరిగి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణల కంటే.. చంద్రబాబు కౌంటర్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఇదంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టి అని అర్థం వచ్చేలా పరిస్థితి మారింది.
* పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్న నాయకులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంది అనేది ఆ పార్టీ నాయకత్వం నమ్మకం. కానీ ఆ పార్టీలో ఎవరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ చర్యలపై ఎవరు స్పందిస్తున్నారు. ఎక్కడికి అక్కడే నాయకులు తమ సొంత నియోజకవర్గాల్లో చిన్నపాటి కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపించేస్తున్నారు. పెద్ద నాయకులు వీకెండ్ పేరిట బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో తలదాచుకుంటున్నారు. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా. కానీ నెక్స్ట్ వచ్చేది మేమే అంటూ మాత్రం ప్రకటనలు చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు అన్ని అనుభవించి.. ఇప్పుడు మాత్రం మొఖం చాటేస్తున్నారు.. ఏదో పార్టీలో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టు మారిపోయారు వాళ్లు. ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో చాలామంది నేతలు నవ్వుల పాలు అవుతున్నారు. తిరిగి కూటమి ప్రభుత్వానికి అస్త్రాలు అందిస్తున్నారు.