Borugadda Anil Kumar: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హయాంలో జరిగిన పాపాలు ఆ పార్టీకి శాపాలుగా మారుతున్నాయి. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గతంలో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తాము వైసిపి మనుషులు అని చెప్పుకొచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నిలిచిన వారిని టార్గెట్ చేసుకునేవారు. వారి కుటుంబాల గురించి సైతం మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే అటువంటి వారితో మొన్నటి ఎన్నికల్లో ఎదురైనా ఫలితాలు గుణపాఠాలుగా మార్చుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వ్యక్తి తమ పార్టీ వాడు కాదని.. ఆయనతో తమకు ఎంత మాత్రం సంబంధం లేదని ప్రకటన చేసేదాకా పరిస్థితి వచ్చిందంటే.. ఆ పార్టీకి డామేజ్ ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తోంది. అయితే ఒక్క బోరుగడ్డ అనిల్ కుమార్ మాత్రమే కాదు.. అలా మాట్లాడిన వారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. వారందరికీ పార్టీతో సంబంధం లేదని చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉందా? అనేది ఒక సందేహం.
జగన్ మనిషి నంటూ..
బోరుగడ్డ అనిల్ కుమార్( Anil Kumar) ప్రతి ఇంటర్వ్యూలోనూ తాను జగన్ మనిషిని అని చెప్పుకునే వారు. జగన్ పై మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించేవారు. మీ ఇంట్లో ఆడవాళ్లు ఉన్న బెడ్ రూమ్ లోకి వచ్చి మరి కొడతాను అని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. ప్రత్యర్థుల కుటుంబాలు, ఆడవాళ్లు, వాళ్ల పిల్లల గురించి సైతం ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు మాత్రం ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని ప్రకటించలేదు. ఇప్పుడు మాత్రమే ఎందుకు ప్రకటించింది అంటే డామేజ్ కంట్రోల్ కోసం. బోరుగడ్డ విపరీతమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రకటించలేదు. కేవలం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను జగన్మోహన్ రెడ్డి మనిషినని చెప్పుకోవడం ద్వారా ఇప్పుడు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉభయులకు గుణపాఠమే..
బోరుగడ్డ అనిల్ పాపం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుంటే జరగదు. చెరిపేసుకుంటామంటే కుదరదు. అటువంటి వారి విషయంలో ఎంటర్టైన్ చేస్తే పరిస్థితి ఇంత దాకా వస్తుంది. అటు పార్టీలు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఏది పడితే అది మాట్లాడే వారికి బోరుగడ్డ ఉదంతం ఒక గుణపాఠం. ప్రత్యర్థిని దెబ్బతీయాలని ఇటువంటి వారిని పెట్టి పోషించుకుంటే ఆ పార్టీకే ముప్పు. అలాగని పార్టీ కోసం, ఫలానా పార్టీ నేత కోసం అలా మాట్లాడితే మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతారన్న విషయం బోరుగడ్డ లాంటివారు గుర్తించుకోవాలి. తమ రాజకీయ ప్రయోజనం కోసమే తన వంటి వారిని ఎంటర్టైన్ చేస్తారన్న విషయాన్ని గ్రహించుకోవాలి. అయితే మొత్తానికి అయితే వైసీపీకి బోరుగడ్డ పాపం వెంటాడుతోంది. అదే సమయంలో బోరుగడ్డ లాంటి వారికి అసలు తత్వం బోధపడుతోంది.