Jagan remarks: జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ) నుంచి అందగాడు అనే మాట చాలా రోజుల కిందట బయట పడింది. వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో చంద్రబాబు, ఆయన కుమారుడు కంటే వంశీ అందగాడు కాబట్టి అరెస్టు చేశారంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కమ్మ సామాజిక వర్గంలో వారిద్దరే నేతలు కాదు.. వల్లభనేని వంశీ మోహన్లాంటి అందగాడు కూడా ఉన్నాడని.. అందుకే ఈర్ష్యతో ఆయన అరెస్టు జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టయినప్పుడు అందంగానే కనిపించారు. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆయన పూర్తిగా మారిపోయారు. అప్పటినుంచి వైసీపీలో ఎవరు అరెస్టు జరిగినా అందంగానే జైల్లోకి వెళ్లడం కనిపించేది. అయితే ఇలానే అందంగా వెళ్లారు జోగి బ్రదర్స్. ఇప్పుడు తాజాగా వెళ్లారు పిన్నెల్లి బ్రదర్స్. వారు ఇప్పుడు బయటకు వచ్చేసరికి ఎలా ఉంటారు అనేది చర్చ.
అప్పట్లో లేనిపోని వ్యాఖ్యలు..
సాధారణంగా జైలుకు వెళ్తే ఎలాంటి వారిపై నైనా సానుభూతి చూపక తప్పదు. కానీ మాజీ సీఎం చంద్రబాబు( Chandrababu) వెళ్లినప్పుడు వైసీపీ నేతలు వ్యంగ్యంగా మాట్లాడారు. జైల్లో ఆయనకు దోమలు కుడుతున్నాయని.. తగిన ఏర్పాటు చేయలేదన్న విమర్శలపై అప్పట్లో కొడాలి నాని కామెంట్స్ చేశారు. జైల్లో దోమలు కొట్టకపోతే రంభ, ఊర్వశి వస్తారా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. అయితే నాడు వైసిపి నేతలు చేసిన కామెంట్స్ అన్ని ఇన్ని కావు. అందుకే వారు జైలుకు వెళ్తుంటే పెద్దగా పట్టించుకునే వారు లేరు. కానీ వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు సమయంలో జగన్మోహన్ రెడ్డి అందగాడు అనే మాట అనేసరికి.. ఆయన జైలు నుంచి బయటకు వచ్చేసరికి చూసిన స్వరూపం అందరికీ గుర్తుండిపోతోంది. అందుకే ఇప్పుడు వరుసగా వైసీపీ సోదరులు జైలుకు వెళ్లేసరికి.. బయటకు ఏ రూపంలో వస్తారా అన్న ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
అప్పటినుంచి ఆ కామెంట్స్..
కల్తీ మద్యం వ్యవహారంలో అరెస్టయ్యారు జోగి రమేష్ బ్రదర్స్( Jogi Ramesh brothers ). జంట హత్యల కేసులో ఇటీవల లొంగిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. వీరికి రోజుల తరబడి రిమాండ్ విధించింది కోర్ట్. ఈ క్రమంలో వీరు జైలుకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యుల బాధ అంతా ఇంతా కాదు. తల్లులు, భార్యలు పరిస్థితిని తట్టుకోలేక గుండెలవిసేలా రోదించారు. కానీ ఇదే రోదన గతంలో టిడిపి నేతలు పడ్డారు. ఆ సమయంలో వైసీపీ నేతలు నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానించారు. అందుకే రాజకీయంగా ఒక మాట అనడం, విమర్శలు చేయడం వంటివి ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ మోహన్ ను అందగాడిగా పోల్చి జైల్లోకి పంపించారు. అప్పటినుంచి వైసిపి అందగాళ్ల బ్యాచ్ అంటూ జైలుకెళ్లే వారి విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి.