YSRCP Adala Prabhakar Reddy Humiliation : నెల్లూరు ( nelluru ) వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దిక్కు ఎవరు? కనీసం పార్టీ శ్రేణులను నడిపించే నేత ఎవరు? అంటే సమాధానం దొరకని పరిస్థితి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా ఇక్కడ చాలామంది ఉండేవారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు విజయసాయిరెడ్డి. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. మాజీమంత్రి గోవర్ధన్ రెడ్డి జైలు పాలయ్యారు. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇంకోవైపు మాజీమంత్రి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన సైతం హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా నిర్వహించగలరు కూడా. అయితే హై కమాండ్ ఆదాల ప్రభాకర్ రెడ్డిని దూరం పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన సైతం పెద్దగా పట్టించుకోవట్లేదు అని సమాచారం. దీంతో నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని నావలా మారింది.
Also Read: ఏపీకి మరో ఉపద్రవం.. ప్రజలకు అలెర్ట్
* ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లాలో వెన్ను దన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించింది. టిడిపిని ఒకటి రెండు స్థానాలకే పరిమితం చేసింది. 2019 ఎన్నికల్లో పూర్తిగా స్వీప్ చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోయింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా సీన్ మారిపోయింది. సైకిల్ దూకుడు ముందు ఫ్యాన్ నిలువలేకపోయింది. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలకు ముందు పెద్ద నేతలు అంత టిడిపికి క్యు కట్టారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. మిగతా నేతలు సైతం సైలెంట్ అయ్యారు.
* మొగ్గు చూపని హైకమాండ్
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి( adala Prabhakar Reddy ) సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన విషయంలో ఎందుకో పార్టీ హై కమాండ్ మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ప్రభాకర్ రెడ్డి. అంతకుముందు ఆయన కాంగ్రెస్ లో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. నెల్లూరు ఎంపీగా ఉన్న ఆయనకు పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అనుచరులు ఉన్నారు. కానీ ఎందుకో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఆయన సేవలను సద్వినియోగం చేసుకోలేకపోతోంది. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఆదాల. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నట్లు అనుచరులు చెబుతున్నారు. అయితే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు కూడా జిల్లాలో ప్రచారం జరుగుతోంది.
* పార్టీ మార్పు పై ప్రచారం..
మరోవైపు ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మార్పుపై అనుచరుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఆయనకు పార్టీ మారే ఉద్దేశం లేదని అనుచరులు చెబుతున్నారు. అయితే పార్టీ పట్టించుకోకపోవడంతోనే ఆయన మనస్థాపంతో ఉన్నారని మరికొందరు చెబుతున్నారు. పిలవని పేరంటానికి ఎందుకని.. కనీసం జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) అపాయింట్మెంట్ లభించడం లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉండగా ఓ సీనియర్ నేత విషయంలో హై కమాండ్ అలా చేయడం ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.