‘నా భూమి నాది కాదన్నారు.. విప్లవ వాదినయ్యాను’..
‘నా శరీరం నాది కాదన్నారు.. స్త్రీవాదినయ్యాను’..
‘నా ఊరు నాది కాదన్నారు.. దళితవాదినయ్యాను’..
‘నా దేశం నాది కాదన్నారు.. మైనార్టీ వాదనయ్యాను’..
‘నా ప్రాంతం నాది కాదన్నారు.. ప్రత్యేక వాదినయ్యాను’..
‘అంతా అయ్యాక నేను మనిషినే కాదన్నారు..అందుకని మానవబాంబునయ్యాను’..
ఒక సాహిత్యంలో సామాజిక ఉద్యమాలన్నింటిని కూడా ఒకే ఒక కవితలో ఇంత సూక్ష్మంగా చెప్పగలిగినపదునైన కలం ఆయనది.. ఆయన పంచమవేదం ద్వారా దళిత కవిత్వానికి పునాది వేశారు. విత్తులు నాటారని అందరూ అంటారు. కానీ కేవలం దళిత ఉద్యమానికే పరిమితం కాకుండా ఎన్నో రాజకీయ, సాంఘిక పరిణామాల మీద అత్యద్భుతమైన కవిత్వం, కథలు, సునిశితమైన విమర్శ ప్రకటించిన ఆయన అక్షరయుద్ధం నేటికి కొనసాగూతూనే ఉంది. అవార్డులు ఆయన పాదాక్రాంతం అవుతూనే ఉన్నాయి.

Satish Chandar : పురస్కారాలే ఆయన చేరువవుతాయి.. కవిత్వాలు ఆయన నోటి నుంచి జాలువారుతాయి.. ఆయన కలం ఒక కాల్పుల రణం.. రాస్తే ప్రభుత్వాలను కదిలిస్తాయి.. పుస్తకంలో స్ఫూర్తినిస్తాయి.. పత్రికలను నడిపిస్తాయి. జర్నలిజానికి మార్గనిర్ధేశం చేస్తాయి. దశాబ్ధాలుగా జర్నలిజంలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్న సీనియర్ జర్నలిస్ట్, కవి, వ్యంగ్యకారుడు, ఎడిటర్, ఓ మల్టీ టాలెంటెడ్ సతీష్ చందర్ అయిన సిగలో మరో పురస్కారం చేరింది.
తరగని కళలున్నాయి.. తరిగిపోని మేధస్సు ఉంది. ఆయన కలం నుంచి జాలువారుతున్న కావ్యాలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. అలరిస్తున్నాయి. ఈ ఆధునిక కాలంలో ఆయన రచనలు అందరినీ ఉర్రూతలూగిస్తున్నాయి. ఆయన వ్యాక్యం ఓ రసాత్మక కావ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు.అలాంటి ఆయన కలానికి తాజాగా అరుదైన గుర్తింపు దక్కింది.
సీనియర్ జర్నలిస్ట్ సతీష్ చందర్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిజంలో 2022 సంవత్సరానికి గాను ‘వైఎస్ఆర్ లైఫ్ అచీవ్ మెంట్’ అవార్డును ప్రకటించింది. ఆయన జర్నలిజంలో చేసిన కృషిని గుర్తించింది. ఇప్పటికే 24 గ్రంథాలను సతీష్ చందర్ ప్రచురించారు. పలు పురస్కారాలను అందుకున్నారు. సతీష్ చందర్ తాజాగా మరో పుస్తకంతో మన ముందుకు వచ్చారు. అదే ‘లవ్ ఎట్ డస్ట్ సైట్’.. ఈ 101 ప్రేమ కథల పుస్తకావిష్కరణ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. సతీష్ చందర్ ప్రతిభను వక్తలు వేయినోళ్ల పొగిడారు. ఈరోజు ఏపీ ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు రావడంతో అందరూ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు.

-సతీష్ చందర్ ఎవరు? ఎలా ఎదిగారు?
సతీష్ చందర్ ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కొమ్ముచిక్కాల అనే గ్రామంలో జన్మించారు. సతీష్ చందర్ తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయులు. అలా కవిత్వం, రాయడం ఆయనకు చిన్నప్పటి నుంచే అలవాటైంది. సౌకర్యాలు లేని మారుమూల గ్రామాల్లో ఆయన తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. అమ్మానాన్నల ప్రభావంతోనే ‘సతీష్ చందర్’ ఒక కవిగా ఎదిగారు. పల్లెటూరులోనే సతీష్ చందర్ చదువుకున్నారు.
హైస్కూలుకు పట్టణానికి వెళ్లారు. సైకిల్ మీద ఆరు కిలోమీటర్లు వెళ్లి మరీ చదువుకున్నారు. రేడియోలో వచ్చే కథలు, సాహిత్యం విని దాన్ని అనుసరిస్తూ రాయడం మొదలుపెట్టారు. ఇంటర్మీడియెట్ చదువుతున్న రోజుల్లోనే ఆయన కథలు రాయడం మొదలుపెట్టారు. అమ్మనాన్నకు తెలియకుండానే ఆ రోజుల్లో రహస్యంగా ఒక కథ రాశారు. ఆ తొలి కథ ఎంపికైంది. రేడియో కథగా మొదలైన సతీష్ చందర్ సాహిత్య ప్రస్థానం కాలేజీలో మరింతగా ఎదిగింది. హైస్కూల్ లో ‘మృత్యుంజయ దాసరి’ అనే ఆర్మీ రిటైర్డ్ టీచర్ 10వ తరగతిలో తెలుగు కవిత్వం చెబుతుంటే ఆకర్షితులయ్యారు. అలా ఆయన సతీష్ చందర్ కు అభిరుచిని కలిగించారు. ఆ తర్వాత కాలేజీకి వెళ్లాక రాయడం అలవాటు చేసుకున్నారు. ఎమర్జెన్సీ కాలంలో హక్కులు, దౌర్జన్యాలపై పుస్తకాలు చదివి స్ఫూర్తి పొందారు. ‘చైతన్యసాహితి’ అనే పత్రికను పెట్టుకొని సతీష్ చందర్ గీసిన చిత్రం.. రాసిన హెడ్డింగులు అందరికీ నచ్చి రాయడం ప్రోత్సహించారు.
చాలా చదువుతూ.. శ్రీశ్రీ ప్రభావం సతీష్ చందర్ పై పడింది. ఆయన కవిత్వాలు చదివి స్ఫూర్తి పొందారు. డిగ్రీ, ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ ఎంకామ్ పూర్తిచేశారు. ఒకనాడు 1996లో మీ పంచమవేదం పుస్తకాన్ని ఎంఏ తెలుగుకు టెక్ట్స్ బుక్ గా చేసుకోవడానికి అనుమతి కోరుతూ సతీష్ చందర్ కు లేఖ రాశారు.
ఆ తర్వాత జర్నలిజంలోకి అడుగుపెట్టారు సతీష్ చందర్. వివిధ పత్రికల్లో మొదట రిపోర్టర్ గా.. ఆ తర్వాత సబ్ ఎడిటర్ గా.. ఆ తర్వాత డిస్ట్రిక్ స్టాఫ్ రిపోర్టర్ గా ఎదిగారు. చీఫ్ రిపోర్టర్ అయ్యి అంచలంచెలుగా ఎదిగారు. 1988లో అనంతరం ఆంధ్రభూమికి విజయవాడ చీఫ్ రిపోర్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఏబీఏ సంపాదకుడిగా ఉండేవారు.
ఇలా అంచలంచెలుగా ఎదిగిన సతీష్ చందర్ వార్త పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ గా 1995-97 మధ్యలో పనిచేశారు. వార్త ఇంటర్నెట్ ఎడిషన్ కు ఎడిటర్ గానూ చేశారు. 1993-94 మధ్యకాలంలో సుప్రభాతం ఎడిటర్ గా చేశారు. 2004-06కు వచ్చేసరికి ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ గా ఎదిగారు. 2008-11 మధ్యాకలంలో వార్త ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేశారు. 2012లో గ్రేట్ ఆంధ్రాకు ఎడిటర్ గా పనిచేశారు.
ఆ తర్వాత సొంతంగా పత్రికలు, మ్యాగజైన్లు ప్రారంభించారు. 2006లో ‘ప్రజ’ అనే తెలుగు డైలీని ప్రారంభించారు. ఇప్పటి వరకూ 24 పుస్తకాలు పైగా రాశారు. ‘తూటాలకు తలలు వాల్చిన వరికంకులు’ అనే సంపాదకీయానికి మంచి గుర్తింపు దక్కింది. నాడు పశ్చిమ గోదావరిలో జరిగిన కాల్పుల్లో మరణించిన రైతుల దీనగాథకు ప్రశంసలు దక్కాయి. ఆయన కలం కత్తిలా పనిచేసి ప్రభుత్వాలను కదిలించింది.

వీ6, డెక్కన్ టీవీ, స్నేహా టీవీల్లో హోస్ట్ గానూ సతీష్ చందర్ చేశారు. ఇక ‘ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజం’ కాలేజీని హైదరాబాద్ లో స్థాపించి ఎంతో మందిని జర్నలిజం వైపు అడుగులు వేయించారు. వారిని తీర్చిదిద్దారు. ఇప్పటికీ ఆ కాలేజీలో చదివిన 15శాతం మంది తెలుగు మీడియాలో కీలక స్తానాల్లో జర్నలిస్టులుగా ఉన్నారంటే సతీష్ చందర్ సామాజిక సృహను అర్థం చేసుకోవచ్చు.
ఇంతలా జర్నలిజంలో.. రచనలతో ఎంతో మందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచిన ‘సతీష్ చందర్’కు తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిజంలో 2022 సంవత్సరానికి గాను ‘వైఎస్ఆర్ లైఫ్ అచీవ్ మెంట్’ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన సేవలకు దక్కిన గౌరవంగా దీన్ని చెప్పొచ్చు. సతీష్ చందర్ కలం నుంచి మరిన్ని జాలువారాలని.. ఆయన ఇంకెన్నో అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుదాం.