YS Sharmila Son: ఏపీ రాజకీయాలపై పట్టు బిగించాలని ప్రయత్నిస్తున్నారు వైఎస్ షర్మిల( Y S Sharmila ). ఇప్పటికే ఆమె కాంగ్రెస్ ఏపీ చీఫ్ గా ఉన్నారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డి పై రాజకీయంగా పోరాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి ఆమె ఒక కారణం. వైసిపి ఓడిపోయిన తరువాత కూడా షర్మిల టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అయితే దీనికి రాజకీయాల కంటే కుటుంబ, వ్యక్తిగత వైరమే కారణమని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు తాను ఒక్కదాన్ని మాత్రమే ఎదురొడ్డి నిలిచారు. ఇప్పుడు సహాయంగా తన కుమారుడు రాజారెడ్డిని తెరపైకి తెస్తుండడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడడం లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి మనవడిగా రాజారెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకం కానున్నారని తెలుస్తోంది. తప్పకుండా తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని షర్మిల సైతం చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి వారసుడిగా తెరపైకి వస్తున్న తన కుమారుడు రాజారెడ్డిని ఆశీర్వదించాలని షర్మిల కోరుతున్నారు.
Also Read: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?
‘రాజారెడ్డి’ చుట్టూ వివాదం..
అయితే రాజారెడ్డి( y s Raja Reddy) అంటే ఒక బ్రాండ్. రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విపరీతమైన ఆరోపణలు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం రాజారెడ్డిని రాయలసీమ సింహం గా పరిగణిస్తారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద పదవులు చేపట్టలేదు కానీ.. రాయలసీమ రాజకీయాలపై ప్రభావం చూపారు. రాజశేఖర్ రెడ్డిని చదివించి ప్రజల మధ్యకు పంపించి.. ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టించి రాజకీయంగా ప్రోత్సహించారు. 1978లో రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అటు తరువాత రాజశేఖర్ రెడ్డి వెనుతిరిగి చూసుకోలేదు. కానీ రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా ఎదగడం వెనుక మాత్రం రాజారెడ్డి పాత్ర ఉంది. ప్రత్యర్థులు రాజారెడ్డిని ఫ్యాక్షనిస్ట్ గా చూస్తారు కానీ.. కాంగ్రెస్తో పాటు వైసిపి శ్రేణులు మాత్రం ఆయనను ఎంతగానో గౌరవంతో చూస్తారు. అటువంటి రాజారెడ్డి పేరును తన మనవడికి పెట్టారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. అయితే ఇప్పుడు అదే రాజారెడ్డి రాజకీయాల్లోకి రావడం.. తమకు వ్యతిరేకంగా నిలబడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోంది. షర్మిల కుమారుడు రాజారెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించడం ప్రారంభించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
* రెండు రోజుల కిందట తల్లి వెంట..
రెండు రోజుల క్రితం తల్లి షర్మిల వెనుక కనిపించారు రాజారెడ్డి. అమ్మమ్మ విజయమ్మ( vijayamma) ఆశీర్వాదం తీసుకోవడంతో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ప్రారంభం అయ్యింది. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వస్తున్న రాజారెడ్డిని ఆదరించాలని షర్మిల కోరడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాయి. ఇప్పుడు ఎదురు దాడి చేయడం ప్రారంభించాయి. షర్మిల కొడుకు రాజశేఖర్ రెడ్డి కి వారసుడు ఎలా అవుతాడని.. ఇప్పటికే రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డిని జనాలు ఆదరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. షర్మిల తో పాటు రాజారెడ్డితో తమకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అందుకే ముప్పేట ఎదురు దాడి చేస్తున్నారు.
* అంత భయమేలా?
అయితే రాజారెడ్డి రాజకీయాల్లోకి రాకమునుపే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆందోళన చెందుతోందని షర్మిల ఎద్దేవా చేశారు. తాజాగా ఈ అంశంపై ఆమె మాట్లాడారు. సైతాన్ సైన్యం ఎంత అరిచి గోల పెట్టినా మార్చలేరు అంటూ మండిపడ్డారు. నా కొడుకే వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసుడు. ఇందులో మరో మాటకు తావులేదు. నా కొడుకు ఇంకా రాజకీయాల్లో అడుగే పెట్టలేదు. అప్పుడే వైసిపి ఇంతలా స్పందిస్తుంటే భయమా? అని నిలదీశారు. చంద్రబాబు చెప్తే తన కుమారుడ్ని రాజకీయాల్లోకి తెచ్చానని అంటున్నారని.. మరి ఎవరు చెబితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతిచ్చారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితాంతం బిజెపిని వ్యతిరేకిస్తే.. అదే బిజెపితో జత కట్టారని జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు. వైయస్సార్ మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన జగన్.. అదే రిలయన్స్ కు చెందిన వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని.. మోడీ కోసం అదానికి గంగవరం పోర్టు కట్టబెట్టారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. మొత్తానికైతే వైయస్ రాజారెడ్డి చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు తిరుగుతుండడం విశేషం.