YSR Congress Support BJP: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ వైఖరి వింతగా ఉంది. రాష్ట్రంలో బిజెపి భాగస్వామ్యంగా ఉన్న టిడిపి కూటమికి వ్యతిరేకంగా ఉంది. అదే టిడిపి కీలక భాగస్వామిగా ఉన్న ఎన్డీఏకు అనుకూలంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్ర బిజెపికి వ్యతిరేకం. ఢిల్లీ బిజెపికి అనుకూలం. 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఖరి పూర్తిగా మారిపోతుందని అంతా భావించారు. కేంద్రంలో చంద్రబాబు ప్రాధాన్యం పెరగడంతో ఎన్డీఏకు వ్యతిరేకం అవుతారని అంచనా వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బిజెపి పట్ల విధేయత భావం విడిచిపెట్టడం లేదు. 40 సంవత్సరాల తరువాత కేంద్రంలో స్పీకర్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి తాజాగా. స్పీకర్ ఓం బిర్లా పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే అడక్కుండానే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ప్రకటన చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?
* అడగకుండానే మద్దతు..
సంఖ్యా బలంగా ఎన్డిఏ( National democratic Alliance ) బలంగా ఉంది. అందుకే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని అందరికీ తెలుసు. అయితే కేంద్రంలో తటస్థం అని ప్రకటించుకునే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. అవిశ్వాసానికి వ్యతిరేకం అని తేల్చి చెప్పింది. ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి కీలక ప్రకటన చేశారు. స్పీకర్ లాంటి రాజ్యాంగబద్ధ పదవి ఔన్నత్యాన్ని కాపాడేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పైగా సభలో తమకు అవకాశం ఇస్తున్న స్పీకర్ కు కృతజ్ఞతగా ఈ నిర్ణయం అన్నట్టు మాట్లాడారు. అయితే ఇప్పుడే కాదు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత.. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థిస్తూ మద్దతు తెలిపింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే రాష్ట్రంలో అదే కూటమికి వ్యతిరేకంగా ఉండి.. కేంద్రంలో అదే కూటమికి మద్దతు తెలపడం అంటే జగన్మోహన్ రెడ్డి చతురత ఉన్న నేతగా అర్థం అవుతోంది.
* ఆది నుంచి ఇదే వైఖరి..
ఆది నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి అదే మాదిరిగా ఉంది. ఆ పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది. కానీ సిద్ధాంతపరంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళింది. అయితే ఈ భావజాలం అనేది బిజెపికి వ్యతిరేకం. అందుకే బిజెపితో నేరుగా పొత్తు పెట్టుకోకుండా.. అంతకుమించి స్నేహాన్ని నడుపుతూ వస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఆవిర్భావం తోనే కేంద్రంలో మోడీ సైతం అధికారంలోకి వస్తూ వచ్చారు. అందుకే కలవకుండానే.. కేంద్రానికి అవసరమైన రాజకీయ మద్దతు ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వ ప్రాపకం పొందడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అవుతూ వచ్చారు. 2019లో తిరుగులేని విజయం సాధించడం వెనుక జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలిచింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే మొన్నటి ఎన్నికల్లో బిజెపి ఫస్ట్ ఛాయిస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ప్రచారం ఉంది. కానీ నేరుగా కలిస్తే తనకు ఇబ్బందులు అని భావించి జగన్మోహన్ రెడ్డి విముఖత చూపారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో బిజెపి టీడీపీకి మళ్ళీ దగ్గర అయింది. మూడు పార్టీలు కలిసి ఘన విజయం సాధించాయి. అయితే తనకున్న కొద్దిపాటి బలాన్ని కూడా బిజెపికి ఎప్పటికప్పుడు అందించి.. ఆ పార్టీ కళ్ళల్లో ఆనందం చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. బిజెపి సైతం ఏపీ విషయంలో తనకు అనుకూలంగా సాగుతున్న రాజకీయం చూసి ఎంజాయ్ చేస్తోంది.