YS Jagan: సార్వత్రిక ఎన్నికల్లో( general elections ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. అయితే ఓటమి ఎదురై ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఉగాది తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కొత్తగా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయనున్నారు.
Also Read: లోకేష్ కు ప్రమోషన్.. చంద్రబాబు ప్లాన్ అదే!
* వెళ్లిన వారి స్థానంలో
సార్వత్రిక ఎన్నికలకు ముందు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ శ్రేణులు కూటమి పార్టీల్లో చేరాయి. ఫలితాల అనంతరం కూడా చాలామంది నేతలు బయటకు వెళ్లిపోయారు. అందుకే ఇప్పుడు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వెళ్లిపోయిన నేతల స్థానంలో కొత్త వారిని నియమించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు, కార్యకర్తలతో వాటిని భర్తీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న వారిని ఆయా పదవుల్లో నియమించనున్నారు.
* పథకాలపై ఫోకస్
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల హామీలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నారు. జనం పై మోపిన చార్జీల భారం, ధాన్యం సేకరణలో విఫలం, ధాన్యానికి మద్దతు ధర వంటి వాటిపై ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయనున్నారు. మరోవైపు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకానికి చెల్లింపులు వంటి అంశాలపై కూడా ఉద్యమించనున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధం కానున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల్లో వారానికి మూడు రోజులపాటు పర్యటించనున్నారు.
* ప్రజా దర్బార్ నిర్వహణకు సిద్ధం
మరోవైపు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వాటికి పరిష్కార మార్గం చూపించేందుకు ప్రజా దర్బార్( Praja Darbar) నిర్వహించనున్నారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ జరగనుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం పులివెందులలో ప్రజా దర్బార్ కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల వెళ్లిన ప్రతిసారి అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ వచ్చారు. ఇప్పుడు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వినతుల విభాగం నడవనుంది.