YS Jagan in Confusion: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధినేత ఆలోచనలు అంతగా సక్సెస్ కాలేదు. గడిచిన ఎన్నికల్లో ఆయన బీసీ నినాదాన్ని వినిపించారు. సంప్రదాయ ఓటర్లుగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు ఉంటారని భావించారు. వారితో పాటు ఎస్టీలు సైతం తనవైపే మొగ్గు చూపుతారని ఆలోచన చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇస్తే.. మొత్తం స్వీప్ చేయవచ్చని అంచనా వేశారు. అయితే తన సంప్రదాయ ఓటు బ్యాంకు గా ఉన్న ఎస్సీలు మాత్రమే తనకు అండగా నిలిచారు. రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ అయింది. మునుపటిలా పనిచేయలేదు. బీసీలు యూటర్న్ తీసుకున్నారు. కూటమి వైపు మొగ్గు చూపారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణమైన దెబ్బ తగిలింది.
దూరమైన వర్గాలకు దగ్గరగా..
దూరమైన వర్గాలను దగ్గర చేసుకునే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy). అందుకే దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పార్టీ నూతన కమిటీల్లో అన్ని సామాజిక వర్గానికి చోటు కల్పించారు. ముఖ్యంగా కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి వారి మద్దతు పొందేలా ప్లాన్ చేస్తున్నారు. గతం మాదిరిగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు తనకు అండగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే పనిలో పడ్డారు.
Also Read: పాపి కొండలు ఆపేశారు.. గోదావరిలో పరిస్థితి ఎలా ఉందంటే?
ప్రాంతాల వారీగా సమావేశాలు
త్వరలో ప్రాంతాలవారీగా సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తారు జగన్మోహన్ రెడ్డి. విశాఖలో( Vishakha ) బ్రాహ్మణ సామాజిక వర్గంతో.. రాజమండ్రిలో కాపు సామాజిక వర్గంతో.. గుంటూరులో కమ్మ సామాజిక వర్గంతో.. విజయవాడలో వైశ్య సామాజిక వర్గంతో.. తిరుపతిలో రెడ్డి సామాజిక వర్గంతో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బిసి వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించారు. యాదవ, చేనేత, మత్స్యకార.. తదితర బీసీ వర్గాలతో సైతం ప్రాంతీయ సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధమవుతోంది.
ఆ భయంతోనే
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అందులో ప్రధానమైనది ఎస్సీ సామాజిక వర్గం. అయితే ఎస్సీ సామాజిక వర్గంలో స్పష్టమైన చీలిక వచ్చింది. దానికి కారణం లేకపోలేదు. ఎస్సీ వర్గీకరణ అనేది ఇబ్బందికర పరిస్థితిని తెచ్చి పెట్టింది జగన్మోహన్ రెడ్డికి. దశాబ్దాలుగా ఎస్సీల్లో వెనుకబడిన వర్గాలు వర్గీకరణ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణ విజయవంతంగా పూర్తి చేయగలిగారు చంద్రబాబు. అందుకే ఆ సామాజిక వర్గంలో స్పష్టమైన చీలిక కనిపిస్తోంది. మరోవైపు రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం. బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని తెరపైకి తెచ్చి రాయలసీమలో రాజకీయాన్ని తనవైపు తిప్పుకున్నారు చంద్రబాబు. అందుకే సంప్రదాయ ఓటు బ్యాంకుగా వస్తున్న రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీలు దూరమవుతారు అన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది. అందుకే ఆయన ఇప్పుడు ప్రాంతాలవారీగా సామాజిక వర్గాల సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.