YS Bharathi in Liquor Scam: మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో జగన్ భార్య భారతి ఉన్నారా? ఆమె ప్రమేయం కూడా ఉందా? ఆమెపై కూడా కేసు నమోదు చేస్తారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే అనుమానం కలుగుతోంది. మద్యం కుంభకోణంలో అప్పటి సీఎం జగన్తో పాటు ఆయన భార్య భారతికి కూడా సంబంధం ఉందని కాంగ్రెస్ పార్టీ ఏపీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు. ఆమె ప్రమేయం ఉందని కూడా తేల్చి చెప్పారు. అయితే ఇంతవరకు ప్రత్యేక దర్యాప్తు బృందం భారతి పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. చార్జిషీట్ తో పాటు నిందితుల రిమాండ్ రిపోర్టుకు సంబంధించిన అంశాలలో భారతి పేరు ప్రస్తావన లేదు. దీంతో ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎలా ఈ ఆరోపణలు చేశారన్నది ప్రాధాన్యత అంశంగా మారింది.
అప్పట్లో ఇదే తరహా అనుమానాలు..
అప్పట్లో వివేకానంద రెడ్డి( Y S Vivekananda Reddy ) హత్య కేసులో సైతం ఇదే తరహా అనుమానాలు వచ్చాయి. దీంతో జగన్ భార్య భారతి పేరు విస్తృతంగా ప్రచారం జరిగింది. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల సమయం కావడంతో మ్యానిఫెస్టో రూపకల్పనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే నాడు వివేకానంద రెడ్డి హత్య విషయం తొలుత భారతికే తెలిసిందని ప్రచారం సాగింది. నాడు మేనిఫెస్టో రూపకల్పనలో బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వివేక చనిపోయారని చెప్పింది భారతి అని.. వ్యక్తిగత సహాయకుడి ద్వారా ఈ సమాచారం అందుకున్న భారతి.. జగన్మోహన్ రెడ్డికి విషయం చెప్పడంతో ఆయన ఇతరులకు చెప్పారన్నది ఒక ప్రచారం. వివేకా హత్య కేసులో భారతి పేరు పదేపదే ప్రస్తావన రావడానికి ఇదే కారణం.
Also Read: మిథున్ రెడ్డి అరెస్ట్.. అంతా సైలెన్స్!
ఆ ఇద్దరు కీలక అధికారులు..
ప్రస్తుతం మద్యం కుంభకోణం కేసులో 12 మంది అరెస్టయ్యారు. అప్పట్లో ముఖ్యమంత్రి కార్యాలయంలో విధులు నిర్వహించే ధనుంజయ రెడ్డి( Dhananjay Reddy), ఓ ఎస్ డి కృష్ణం మోహన్ రెడ్డి సైతం అరెస్టయ్యారు. అప్పట్లో సీఎం జగన్తో పాటు భారతి ఆదేశాలు ఈ అధికారులు పాటించే వారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పట్లో విశాఖ భూ వ్యవహారాల్లో భారతి వేలు పెట్టారని.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణం పర్యవేక్షణ కూడా ఆమె చేశారన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఈ ఇద్దరు కీలక అధికారులు భారతి ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేసేవారని ప్రచారం ఉండేది. ఇప్పుడు ఆ ఇద్దరు అధికారుల అరెస్టుతో భారతి పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.
బాలాజీ గోవిందప్ప అరెస్టుతో..
మరోవైపు ఈ కేసులో భారతి సిమెంట్స్ వ్యవహారాలు చూసే బాలాజీ గోవిందప్ప( Balaji govindappa ) కూడా అరెస్టు అయ్యారు. జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలు చూసేది కూడా ఆయనేనని తెలుస్తోంది. ఒకవేళ మద్యం కుంభకోణం కేసులో ఆయనను ముందుకు పెట్టి భారతి నడిపించారన్న అనుమానాలు కూడా పలుకుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ఏపీ ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.