Mithun Reddy Arrested: మద్యం కుంభకోణం కేసులో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి( Mithun Reddy ) అరెస్ట్ అయ్యారు. అయితే ఆయన అరెస్టుపై చిత్తూరు జిల్లా టిడిపి నేతలు నోరు తెరవడం లేదు. రాయలసీమ టిడిపి నేతలు సైతం పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం నేతలంతా ఏకతాటి పైకి వచ్చారు. మిధున్ రెడ్డి అరెస్టును ఖండించారు. ఇది ముమ్మాటికీ తప్పుడు కేసుగా చెబుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ఎదుగుదలను సహించలేక ఇలా చేశారని ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డి తో చంద్రబాబు దశాబ్దాల వైరం ఉందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపునకు దిగారని ఆరోపిస్తున్నారు. అయితే దీనిని తిప్పి కొట్టడంలో చిత్తూరు టిడిపి నేతలు, రాయలసీమ టిడిపి నేతలు ఫెయిల్ అయ్యారు అన్నది ఒక వాదన. అధికార పార్టీలో ఉండి ఎందుకు భయపడుతున్నారు అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు.
సుదీర్ఘ నేపథ్యం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi Reddy Ramachandra Reddy ) సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబుతో పాటు రాజశేఖర్ రెడ్డికి సమకాలీకుడు. జనతా పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తరువాత కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబుతో కలిసి పనిచేశారు. అయితే ఈ క్రమంలో పెద్దిరెడ్డి కంటే చంద్రబాబు పై చేయి సాధిస్తూ వచ్చారు. చంద్రబాబు టీడీపీలోకి వెళ్లిపోయిన తర్వాత వీరి మధ్య వైరం పెరిగింది. చంద్రబాబు రాష్ట్ర నేతగా మారారు. అయితే జిల్లాపై పెద్దిరెడ్డి సాధించిన మాదిరిగా పట్టు సాధించలేకపోయారు చంద్రబాబు. అయితే దానికి కారణాలు లేకపోలేదు. రాష్ట్ర నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఆ స్థాయిలో అన్ని జిల్లాలపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆపై పెద్దిరెడ్డి మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తే దాని పర్యవసానాలు ఒక్కోసారి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందుకే చంద్రబాబులో ఆ దూకుడు లేకపోవడం కూడా చిత్తూరు జిల్లా పై పెద్దిరెడ్డి మాదిరిగా పట్టు సాధించలేకపోయారు.
Also Read: జగన్ కు అండగా జాతీయ పార్టీలు.. ఏపీలో కష్టమే!
రాయలసీమలో హవా..
పెద్దిరెడ్డి కుటుంబం అంటే రాయలసీమలో( Rayalaseema ) ఒక రకమైన ప్రత్యేక ఫీలింగ్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలంగా పనిచేసింది ఆ కుటుంబం. అదే స్థాయిలో అధికార దర్పాన్ని కూడా ప్రదర్శించింది ఆ కుటుంబం. అన్నింటికీ మించి జగన్మోహన్ రెడ్డి అంటే ఆ కుటుంబానికి చాలా అభిమానం. పెద్దిరెడ్డి కుటుంబం అండదండలు ఉంటే తనకు రాజకీయంగా ఈజీ అవుతుందని కూడా జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా రాయలసీమలో నడిచింది. ఆయన మాట చెల్లుబాటు అయింది. అయితే చంద్రబాబుతో ఉన్న దశాబ్దాల వైరంతో గట్టిగానే పనిచేశారు పెద్దిరెడ్డి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు సైతం పెద్దిరెడ్డి అంటే హడలెత్తిపోయేలా వ్యవహరించారు. ప్రస్తుతం వారు మౌనంగా ఉండడానికి అదే ప్రధాన కారణం.
అప్పట్లో పరోక్ష సహకారం..
వైసిపి ( YSR Congress ) హయాంలో చాలామంది టిడిపి నేతలకు పరోక్ష సహకారం అందించిందట పెద్దిరెడ్డి కుటుంబం. అందుకే ఇప్పుడు వారు ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు విషయంపై స్పందించడం లేదు. బయటకు మాట్లాడడం లేదు. రేపు అధికారం తారుమారు అయితే.. తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో కూడా చాలామంది ఉన్నారు. అందుకే పెద్దగా మాట్లాడటం లేదు. అదేదో రాష్ట్రస్థాయిలో జరిగిందని చేతులు దులుపుకుంటున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలా లేదు. రాయలసీమ వ్యాప్తంగా పార్టీ నేతలు మిధున్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నారు. మొత్తానికైతే మిధున్ రెడ్డి అరెస్ట్ విషయంలో టిడిపి నేతల వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.