YS Bharathi: జగన్ కు షాక్ ల మీద షాక్.. భారతి పిఏ అరెస్ట్

రవీంద్ర రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సైతం అనుచిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టేవారు. పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల, వివేక కుమార్తె సునీతలు పై ఇదే తరహా పోస్టులు పెట్టారు.

Written By: Dharma, Updated On : June 22, 2024 12:48 pm

YS Bharathi

Follow us on

YS Bharathi: మాజీ సీఎం జగన్ కు షాక్. ఒకవైపు అమరావతిలోని వైసిపి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయగా.. మరోవైపు సతీమణి భారతి పిఎను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలో నమోదైన కేసులకు సంబంధించి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా వర్ర రవీంద్ర రెడ్డి భారతి రెడ్డి పీఏ గా పనిచేస్తున్నారు. ప్రతిపక్ష మహిళా నేతలపై అసభ్య పోస్టింగ్స్ పెట్టేవారని రవీంద్ర రెడ్డి పై అపవాదులు ఉన్నాయి. తనతో పాటు వైయస్ షర్మిలపై సోషల్ మీడియాలో రవీంద్ర రెడ్డి అనుచిత పోస్టులు పెట్టారని సునీత హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు కూడా నమోదు అయ్యింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో రవీంద్ర రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కడప నుంచి కదిరి వెళ్లే మార్గంలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

రవీంద్ర రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై సైతం అనుచిత పోస్టులను సోషల్ మీడియాలో పెట్టేవారు. పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల, వివేక కుమార్తె సునీతలు పై ఇదే తరహా పోస్టులు పెట్టారు. అప్పట్లో వారిద్దరూ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయనను అరెస్టు చేస్తారని కూడా ప్రచారం సాగింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్ర రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేశారని కామెంట్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటికే రెడ్ బుక్ లో నమోదైన చాలామంది అధికారులపై బదిలీ వేటు పడింది. 19 మంది అధికారులపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా జగన్కు అత్యంత విధేయులైన నలుగురు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు అప్పగించారు. వారికి ఎటువంటి పోస్టింగులు కేటాయించలేదు. తాజాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలపై దృష్టి పెట్టారు. ఈ జాబితాలో నేటి హోం శాఖామంత్రి వంగలపూడి అనిత కూడా బాధితురాలే. ఆమె బాధ్యతలు స్వీకరిస్తూ సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్ర రవీంద్రరెడ్డి అరెస్టు అయ్యారు అన్న ప్రచారం జరుగుతోంది.

వంగలపూడి అనిత పై వైసిపి సర్కార్ హయాంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వెలిశాయి. అప్పట్లో రోజులు లెక్క పెట్టుకోవాలని.. ఈరోజు తానేం చేయలేకపోవచ్చని.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని… తాను ఏదో ఒక రోజు బదులు తీర్చుకుంటానంటూ ఆమె గతంలో ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. వర్ర రవీందర్ రెడ్డి పులివెందులలో జగన్ అండ చూసుకుని రెచ్చిపోతున్నాడని.. వాడిని అసలు వదిలి పెట్టేది లేదని గట్టిగానే హెచ్చరించారు. ఇప్పుడు అదే అనిత హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో రవీందర్ రెడ్డి పై చర్యలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సైబరాబాద్ లో షర్మిల, సునీతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు స్పందించారు. ఆంధ్రా పోలీసుల సహకారంతో.. కడప నుంచి కదిరి వెళ్లే మార్గంలో పోలీసులు రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.