Yellow Media : ఎల్లో మీడియా విష ప్రచారం పిచ్చికి పరాకాష్టగా మారింది. నిద్ర లేస్తే ప్రభుత్వంపై విష ప్రచారం చేయాలి, ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తోంది. జగన్ సర్కారు చేసే మంచిని కళ్లు ఉన్న కబోధిలా చూస్తోంది. ముఖ్యంగా గృహ నిర్మాణం విషయంలో ఎల్లో మీడియా చేస్తున్న అతి అంతా ఇంతా కాదు. దేశంలోనే జగన్ సర్కారు గృహ నిర్మాణంలో దిగజారిపోయిందని.. 19వ స్థానానికి పడిపోయిందని కథనాలు వండి వార్చింది. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కేంద్ర అధ్యయనమే అందుకు సజీవ సాక్షం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం అంటూ ఎల్లో మీడియా పతాక శీర్షికన కథనాలు ప్రచురించింది. అదిగో నిర్మాణం.. ఇదిగో గృహ ప్రవేశమంటూ హడావుడి చేసింది. కానీ ఒక్క ఇంటిని సైతం పూర్తిచేయలేకపోయింది. తమ హయాంలో మంజూరైన టిడ్కో గృహ నిర్మాణాన్ని పూర్తిచేయలేక.. లబ్ధిదారులకు అందించలేక చేతులెత్తేశారు.ఇప్పుడు వైసీపీ సర్కారు హయాంలో సైతం అదే ఫెయిల్యూర్ ను చూపించాలని ఎల్లో మీడియా ఆరాటపడుతోంది. అందుకే అసత్య కథనాలు, వార్తలను ప్రచురిస్తోంది.
రాష్ట్రంలో 30 లక్షల గృహ నిర్మాణమంటూ జగన్ సర్కారు ప్రకటించింది. ఉద్యమంలా చేపడుతున్నట్టు చెప్పుకొస్తోంది. అయితే కేంద్రానికి ఇచ్చిన అధ్యయనంలో మాత్రం 8 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్టు తుది నివేదిక ఇచ్చింది. ఇందులో గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిపివేసిన మూడున్నర లక్షలతో పాటు ప్రస్తుతం నాలుగున్నర లక్షలు పూర్తిచేసినట్టు దాని సారాంశం. అంటే టీడీపీ హయాంలో మూడున్నర లక్షలు మాత్రమే ఇళ్లు నిర్మించారు. అదే వైసీపీ సర్కారు అదనంగా ఒక లక్ష నిర్మించిందన్న మాట. కానీ దీనిని కూడా ఒప్పుకోలేని స్థితిలో ఎల్లో మీడియా ఉండడం విచారకరం.
నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంటుంది ఏపీలో ఎల్లో మీడియా వ్యవహారం. ఆ మీడియాకు కులాభిమానం అధికం. తమవారే పవర్ లో ఉండాలి. పవర్ ను ఎంజాయ్ చేయాలి. ఆ సామాజికవర్గమే డెవలప్ కావాలి. ఈ కాన్సెప్ట్ తోనే అవి బతికేస్తుంటాయి. అవసరమైతే ఎంతకైనా తెగిస్తాయి. ఈ క్రమంలో అదిరిస్తాయి.. బెదిరిస్తాయి. అవసరమైతే నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తాయి. ముద్రణ, ప్రసార రంగంలో తనకంటూ ముద్ర వేసుకొని.. మీడియా ముసుగులో అవి దశాబ్దాలుగా సాగిస్తున్న దందా అంతా ఇంతా కాదు. ప్రజల సంక్షేమం కంటే., తమవారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముచ్చటగా ‘ఎల్లో’ మీడియాగా గుర్తించబడ్డాయి.