Pawankalyan : పవన్ వారాహి తొలివిడత యాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. వైసీపీ నేతల ఫ్యూజులు కదిలిపోయాయి. అది ఎవరో పనిగట్టుకొని చెప్పడం అక్కర్లేదు. అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యం, స్పందన చూస్తుంటే తెలిసిపోతోంది. వారే యాత్రను సక్సెస్ చేశారు. వారాహిని పంది అనడం నుంచి పవన్ కళ్యాణ్ అంతుచూస్తామన్న వరకూ పరిస్థితి వచ్చిందంటే వారి కడుపు మంటతో యాత్ర ఎంతలా వారిని కదిలించిందో అర్ధమవుతోంది. చివరకు సజ్జల నుంచి పోసాని కృష్ణమురళీ వరకూ ఎంటరయ్యారంటే పవన్ ఎంత గట్టిగా కొట్టారోనని జన సైనికులు సెటైర్లు వేస్తున్నారు. అయితే డజను కొద్దీ నేతలు పనిగట్టుకొని రావడం వెనుక వైసీపీ పక్కా స్కెచ్ ఉంది. కాపుల్లో కాస్తా చీలిక తెచ్చైనా జరగాల్సిన నష్టాన్ని అధిగమిద్దామన్న ప్లాన్ కనిపిస్తోంది.
సాధారణంగా పవన్ కార్యక్రమాలంటేనే జన సమీకరణ చేయాల్సిన పని ఉండదు. అందునా పవన్ ప్రభావం అధికంగా ఉండే ఉభయగోదావరి జిల్లాల్లో అయితే వారాహి యాత్ర గురించి చెప్పనక్కర్లేదు. ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. ముఖ్యంగా కాపులు విపరీతంగా పోలరైజ్ అయినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు వెళ్లాయి. దీంతో ప్రభుత్వ వర్గాల్లో కలవరపాటు రేగింది. ఏదో ఉపశమన చర్యలు చేపట్టకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించిన జగన్ సర్కారు ముద్రగడను రంగంలోకి దించింది. ఏకంగా ఓ రెడ్డి సామాజికవర్గం నేతను అడ్డంపెట్టుకొని కాపులను చీల్చాలన్న ప్లాన్ ను రెడీ చేసింది. అయితే పవన్ ను తిట్టాలన్న వ్యూహానికి ముద్రగడ లాంటి నాయకుడు ఒప్పుకోవడం ఆత్మహత్య సదృశ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటికే వైసీపీ కాపు నాయకులు పవన్ కు అడ్డంగా వెళ్లి చేతులు కాల్చుకున్నారు. అంతకు మించిన వ్యక్తులతోనే తిట్టిస్తే కాపుల్లో ఒక రకమైన భావన కలుగుతుందని భావించారు. అందుకే ముద్రగడను రంగంలోకి దించారు. యావత్ కాపు జాతి పవన్ వెంట నడవకూడదనే భావనతోనే కాపు ఉద్యమం చేసిన ముద్రగడను ఎంచుకున్నారు. అది కూడా వర్కవుట్ అవ్వకపోయేసరికి ముద్రగడను పొగడ్తలతో ముంచెత్తే బ్యాచ్ ను రంగంలోకి దించారు. వంగవీటి మోహన్ రంగా బావమరిదితో సైతం చెప్పించారు. చివరకు పోసాని కృష్ణమురళీని సైతం రప్పించి ప్రజారాజ్యం సమయంలో చిరంజీవికి ఎదురైన అవమానాలు గుర్తుచేయించారు. తాను కమ్మ అయినా నాడు కాపు జాతిపై కుట్ర చేశారని చెప్పించి పవన్ ను వెనక్కి తగ్గించే ఏర్పాట్లు చేశారు. ఆ పాచిక కూడా పారలేదు.
పవన్ పై సామ, వేద దండోపాయాలను ప్రయోగించాలని చూశారు. చివరకు ముద్రగడ సవాళ్ల పర్వానికి దిగారు. దమ్ముంటే పిఠాపురం నుంచి తనపై పోటీచేయించాలని సవాల్ చేశారు. కానీ దేనికీ పవన్ స్పందించలేదు. కానీ కాపు సంఘం ప్రతినిధులు, జన సైనికులు ముద్రగడకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. కాపులను అడ్డగించాలన్న ప్రయత్నంలో భాగంగా పవన్ పై వైసీపీ చేసిన ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. దీంతో కాపుల్లో ఒక రకమైన ఐక్యతారాగం కనిపించింది. అది తప్పకుండా వైసీపీకి నష్టం చేకూర్చుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.