YCP – surveys : ఎన్నికలు సమీపిస్తున్న కొలది సర్వేలు, ఒపీనియన్ పోల్స్ సహజం. ప్రజల నాడిని పట్టేందుకు రాజకీయ పక్షాలే ఈ సర్వేలను ప్రోత్సహిస్తుంటాయి. అయితే గతం మాదిరిగా సర్వేలకు పారదర్శకత లేదు. గతంలో సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉండేవి. కానీ ఆ సర్వే సంస్థలు ప్రలోభాలకు లొంగిపోయాయి. ఓటర్లను డైవర్షన్ చేసేందుకు.. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేందుకు సర్వేలను, ఒపీనియన్ పోల్స్ ను వినియోగిస్తుండడం విచారకరం. గతంలో ఎంతో క్రెడిబిలిటీ ఉండి.. సర్వేలు చేసిన సంస్థలు.. వాటి ఫలితాలు వెల్లడిలో ఫెయిల్ అయ్యాయి.
సోషల్ మీడియా,డిజిటల్ మీడియా పేరిట రోజుకో సర్వేలు వెల్లడవుతున్నాయి. తమకు నచ్చిన పార్టీకి ఏకపక్ష విజయాలను కట్టబెడుతున్నాయి. దీనిపైనే ఆయా పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కొద్దిరోజులుగా నేషనల్ మీడియా పేరుతో సర్వేలు వెల్లడయ్యాయి. దాదాపు సర్వేలన్నీ వైసీపీకి ఏకపక్ష విజయాలను కట్టబెట్టాయి. అయితే తాజాగా వెల్లడైన పంచాయతీ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గ్రౌండ్ లెవెల్ లో ఉండే వార్డు ఉప ఎనికల్లో సైతం ప్రతిఘటన ఎదురైంది. విపక్ష పార్టీల మద్దతుదారులు మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్నారు. ఈ తరుణంలో ఇటీవల వెల్లడైన సర్వేలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ దే హవా అంటూ నేషనల్ మీడియా సంస్థలు హోరెత్తిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వైసీపీకి విజయాన్ని కట్టబెట్టిన సంస్థలే.. మరోసారి ఆ పార్టీకి తిరుగులేని విజయం దక్కుతుందని అంచనా వేశాయి. దీంతో వైసిపి శ్రేణుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అందుకే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక తమకు తిరుగుండదని భావిస్తున్నారు. ప్రత్యర్థులకు ఏకంగా సవాలే విసురుతున్నారు. తాజా పంచాయతీ ఉప ఎన్నికల్లో ఎదురైన దెబ్బ వారికి మింగుడు పడడం లేదు. సర్వే సంస్థల క్రెడిబిలిటీని ఆరా తీస్తున్నారు.
సర్వేలన్నీ అనుకూలంగా రావడంతో వైసీపీలో ఓ రకమైన ధీమా వ్యక్తం అవుతోంది. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. ఇది అధికార పార్టీకి మింగుడు పడని అంశము. సర్వేల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని ఏదైనా పార్టీ పొంగిపోతే అది నీటి బుడగ గా మారే అవకాశం ఉంది. అక్కడి నుంచే సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరోసారి అధికారం నిలబెట్టుకుంటున్నామన్న అతి ధీమా వైసీపీలో కనిపిస్తుంది. ఇక గెలిచేసాము అన్నట్టు ఆ పార్టీ నేతలు వ్యవహార శైలి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది. మేల్కొనకుంటే మూల్యం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.