HomeతెలంగాణBRS : "కారు"లో ఉద్యమకారులకు చోటు లేదు

BRS : “కారు”లో ఉద్యమకారులకు చోటు లేదు

BRS : ఉద్యమ కాలంలో వారంతా రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేశారు. విలువైన భవిష్యత్తును వదులుకొని భారత రాష్ట్ర సమితి జెండా మోసారు. సకలజనుల సంబంధించి మొదలు పెడితే వంటా వార్పు వరకు వారే ముందు నడిచారు. పోలీసులతో దెబ్బలు తిన్నారు. కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తెలంగాణ సిద్ధించిన తర్వాత తమ త్యాగానికి గుర్తింపు లభిస్తుందని సంబరపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. ఉద్యమ కాలంలో ఎవరి చేతిలో అయితే వారు తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొన్నారో.. వారే అధికారాన్ని చెలాయిస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నారు. అంతే కాదు కొద్దో గొప్పో మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితిలో ప్రజా ప్రతినిధులు గా ఉన్నవారు ఇప్పుడు ఆ కాస్త అధికారానికి కూడా దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమకారుల అవకాశాలకు గులాబీ బాస్ కేసీఆర్ పూర్తిగా పాతర వేశారు! పార్టీలో మిగిలిన కొద్దిమంది ఉద్యమ నేతలకు ఈసారి ఎన్నికల్లో మొహమాటం లేకుండా టికెట్లు ఇవ్వనని చెప్పేశారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల జాబితా ను సిద్ధం చేసిన తర్వాత వారికి ఈ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ జాబితాను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. 25 నుంచి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ సంఖ్య ఇప్పుడు తగ్గింది. పదికి కాస్త అటూ ఇటుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ మార్చే చోట ఇతర అభ్యర్థులను పని చేసుకోవాలని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పడం ఇక్కడ విశేషం. ఇక టికెట్ నిరాకరించే అభ్యర్థులకు ఆ విషయం కూడా చెప్పడం లేదని సమాచారం. వారిని బుజ్జగించాలని కోవడం లేదు. కాగా ఎక్కువ సంఖ్యలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారుస్తారు అనుకున్నప్పటికీ.. వారి నుంచి అధిష్టానం పైకి తీవ్ర ఒత్తిళ్ళు వచ్చాయి.

ఇక పార్టీలో మొదటి నుంచి ఉన్న ఉద్యమకారులకు ఎప్పటిలాగే మళ్ళీ భారత రాష్ట్ర సమితి అధిష్టానం మొండి చేయి చూపుతోంది. వారికి టికెట్లు ఇవ్వడం లేదని సంకేతాలను ఇప్పటికే పంపింది. దీంతో ఉద్యమ తెలంగాణ బ్యాచ్ తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయింది. కొంతమంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పార్టీ టికెట్ ఈసారి కూడా రాదన్న నిర్ణయానికి వచ్చేసారు. తమ దారి తామ వెతుక్కోవాలన్న అభిప్రాయానికి వచ్చేశారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున ఉద్యమకారులకు ఎన్నికల్లో పోటీ చేయడానికి చెప్పుకోదగ్గ అవకాశాలు వచ్చాయి. బంగారు తెలంగాణ పేరుతో టిడిపి, కాంగ్రెస్ పార్టీలో టికెట్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలు భారత రాష్ట్ర సమితిలో చేరడంతో మొదటి నుంచి ఉన్న ఉద్యమకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉన్న ఉద్యమకారులకు కార్పొరేషన్ లేదా ఎమ్మెల్సీలు ఇస్తారు అనుకుంటే..అవీ కూడా లేవు. ఎన్నికల్లో ఓడిపోయి, ఆర్థికంగా చతికిల పడి రెంటికి చెడ్డ రేవడి లాగా వారు మారిపోయారు. ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు పదవులు అనుభవిస్తుంటే ఉద్యమకారులు మాత్రం ఆ బాధను పంటి బిగువన భరిస్తూ వచ్చారు. 2018 ఎన్నికల సందర్భంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ టికెట్లు ఇచ్చే క్రమంలో కేసీఆర్ మరొకసారి ఉద్యమకారులకు మొండి చూపారు. అయితే ఈసారి వారిని తన వద్దకు పిలిపించుకుని బుజ్జగించారు. ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ పదవులు ఇస్తామని వారికి ఆశపెట్టారు. దీంతో గత ఎన్నికల్లో వారంతా కూడా భారత రాష్ట్ర సమితికి సపోర్ట్ చేశారు. కానీ ఎన్నికల్లో విజయం తర్వాత భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖర రావు ఆ దిశగా ఏ రోజు కూడా ఆలోచించలేదు.

ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన చాడా కిషన్ రెడ్డి, వేముల వీరేశం, ఖమ్మం జిల్లాకు చెందిన బొమ్మెర రామ్మూర్తి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎల్బీనగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కేఎస్ రత్నం, కాంగ్రెస్ నుంచి భారత రాష్ట్ర సమితిలోకి వచ్చిన క్యామ మల్లేశం తో పాటు పలువురు సీనియర్ నేతలు అధిష్టానం మీద ఆగ్రహంగా ఉన్నారు. వీరికి టికెట్లు ఇవ్వబోమని అధిష్టానం సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో వీరు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసి తాము గెలవకపోయినా కూడా అధికార పార్టీ అభ్యర్థుల గెలుపు అవకాశాలను దెబ్బతీయాలని వీరు చూస్తున్నారు. తమ సన్నిహితులతో సమావేశాలు నిర్వహించి భారత రాష్ట్ర సమితితో తాడోపేడో తెల్చుకోవాలనుకుంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular