YSRCP : వైసిపి అధికారానికి దూరమైన తర్వాత పరిస్థితి మారిందా? ఇప్పుడే అసలు సిసలు కష్టాలు మొదలయ్యాయా? అధికారాన్ని అనుభవించిన వారు సైడ్ అవుతున్నారా? ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసినవారు ముఖం చాటేయడానికి కారణాలేంటి? ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగమే వికపించిందా? దాదాపు 100 నియోజకవర్గాల్లో వైసిపి నాయకత్వం లోటు కనిపిస్తోందా? ఆ ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. జగన్ రెండోసారి విజయం కోసం చాలా రకాలుగా ప్రయోగాలు చేశారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100చోట్ల కొత్త అభ్యర్థులను ప్రకటించారు. కొందరిని పక్కన పడేయడం, వేరే జిల్లాల నేతలను తీసుకొచ్చి పోటీ చేయించడం వంటి ప్రయోగాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు వంద చోట్ల వరకు ఇదే పని జరిగింది. కానీ అన్నిచోట్ల వైసిపి అభ్యర్థులు ఓడిపోయారు. దీంతో పక్కకు తప్పించినవారు అసంతృప్తితో పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. కొత్తవారు సైతం తమకెందుకులే అంటూ ముఖం చాటేస్తున్నారు. ఐదేళ్లపాటు మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం సైడ్ అయిపోతున్నారు. దీంతో వైసిపి అంటే జగన్ మాత్రమే అన్నట్టు నియోజకవర్గాల్లో పరిస్థితి ఉంది. ఇది ఇలానే కొనసాగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
* వికటించిన ప్రయోగం
వై నాట్ వన్ 175 అన్న నినాదంతో ఎన్నికల బరిలో దిగారు జగన్. వ్యతిరేకత ఉన్నచోట కొత్తవారిని ప్రయోగించారు. అయితే ఒక నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నవారిని మరో నియోజకవర్గంలో అభ్యర్థిగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు విజయనగరం జిల్లా రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులపై వ్యతిరేకత ఉంది. ఆయనను తీసుకొచ్చి విశాఖ జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ అభ్యర్థిని చేశారు. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు తప్పించారు. ఆయనకు రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కంబాల జోగుల జాడలేదు. అలాగని గొల్ల బాబురావు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీ క్యాడర్ కు భరోసా ఇచ్చిన నేత లేరు.
* అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి
అయితే ఒకటి రెండు నియోజకవర్గాలే కాదు.. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన నాయకత్వం లేదు. ఎన్నికలకు ముందు చేసిన ప్రయోగాలు వికటించి చాలామంది నేతలు పార్టీకి దూరమయ్యారు. ఎన్నికలకు ముందు కొందరు పార్టీని వీడారు. ఎన్నికల తరువాత మరికొంతమంది పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికలకు ముందు పక్కకు తప్పించిన నేతలు అసంతృప్తితో ఉన్నారు. అప్పటి నుంచే వారు ప్రత్యర్థులతో చేతులు కలిపారు. అటువంటివారు వైసిపి క్యాడర్ను పట్టించుకునే స్థితిలో లేరు. పైగా తమ వెంట మెజారిటీ క్యాడర్ను టిడిపిలోకి తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా ఎలా చూసుకున్నా వైసీపీకి ఇవి ఇబ్బందికర పరిణామాలే.
* సైడ్ అవుతున్న నేతలు
2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ,22 పార్లమెంట్ స్థానాలతో అద్భుత విజయం సాధించింది వైసిపి.తాజా ఎన్నికల్లో అంతే సంచలనం సృష్టిస్తూ ఓటమి పాలైంది. పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధపడుతున్నారు. మరి కొందరు రాజకీయంగా సైలెంట్ అవుతున్నారు. కొత్తవారు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. గత ఐదేళ్లుగా ఇన్చార్జిలుగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. ఈ ఐదేళ్లు కష్టపడినా తమకు టిక్కెట్ దక్కుతుందన్న గ్యారెంటీ కూడా చాలామందిలో లేదు. అందుకే పార్టీ భారాన్ని మోసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.దీంతో వైసీపీకి నియోజకవర్గస్థాయిలో నాయకత్వ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మరి జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.