https://oktelugu.com/

World Test Championship : భారత్ – ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్లే అయినప్పటికీ.. WTC రేసులో ఈ జట్లను తక్కువ అంచనా వేయొద్దు..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభమై రెండు సీజన్లు పూర్తయ్యాయి. తొలిసారి న్యూజిలాండ్ గెలిచింది. మరోసారి ఆస్ట్రేలియా విజయం సాధించింది. రెండుసార్లు వెళ్లినప్పటికీ.. భారత్ టెస్ట్ గదను సొంతం చేసుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా టెస్ట్ గదను దక్కించుకోవాలని భావిస్తోంది. త్వరలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా - భారత్ తలపడతాయని అంచనాలు ఉన్నప్పటికీ.. ఈ జట్లను తక్కువ అంచనా వేయడానికి లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 12, 2024 / 11:48 AM IST

    WTC 2025

    Follow us on

    World Test Championship : టెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. ఆ జట్టు 62.5 విజయాల శాతంతో కొనసాగుతోంది. త్వరలో ఆస్ట్రేలియా స్వదేశంలో భారత జట్టుతో ఐదు టెస్ట్ మ్యాచ్ లు, శ్రీలంకతో రెండు టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో నాలుగు మ్యాచ్ లు గెలిస్తే ఆస్ట్రేలియాకు ఫైనల్ బెర్త్ దక్కుతుంది. ఒకవేళ మూడు మ్యాచ్ లు గెలిచినా ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఇతర జట్ల సమీకరణాలు కూడా ఆస్ట్రేలియాకు అనుకూలంగా ఉండాలి. ఆస్ట్రేలియాకు ఫైనల్ అవకాశాలు ప్రమాదంలో పడకూడదు అనుకుంటే భారత జట్టుతో జరిగే సిరీస్ కచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది.

    ఇంగ్లాండ్ జట్టు

    ఇంగ్లాండ్ జట్టు ఇటీవల కాలం దాకా టెస్ట్ ర్యాంకింగ్స్ లో పటిష్ట స్థితిలోనే ఉంది. కానీ ఆ జట్టు తనకంటే తక్కువ ర్యాంకు ఉన్న శ్రీలంక చేతిలో చివరి టెస్టులో ఓటమిపాలైంది. దీంతో అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇంగ్లాండ్ జట్టు గెలుపు శాతం ప్రస్తుతం 42.19 మాత్రమే. పాయింట్ల పట్టికలో ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టు త్వరలో పాకిస్తాన్ జట్టుతో మూడు, న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్ట్ లు ఆడాల్సి ఉంది. ఒకవేళ ఈ ఆరు టెస్ట్ లు గెలిచినా గెలుపు శాతం 57.95 శాతానికి చేరుకుంటుంది. ఇతర జట్ల ఫలితాలు ఒకవేళ కలిసి వస్తే.. ఇంగ్లాండ్ ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు.

    న్యూజిలాండ్ జట్టు

    న్యూజిలాండ్ జట్టు ప్రస్తుతం 50% విజయాలతో పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక జట్టుతో రెండు, భారత జట్టుతో మూడు టెస్ట్ మ్యాచ్ లు న్యూజిలాండ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఎనిమిది మ్యాచ్లకు గానూ ఆరు విజయాలు సాధిస్తే న్యూజిలాండ్ ముందడుగు వేయగలదు. ఒకవేళ ఐదు మ్యాచ్లు నెగ్గి మిగతావి డ్రా చేసుకుంటే న్యూజిలాండ్ జట్టుకు అవకాశాలుంటాయి. కానీ అదంత సులభం కాదు. శ్రీలంక, భారత జట్లను ఎదుర్కోవడం న్యూజిలాండ్ కు అంత ఈజీ కాదు.

    బంగ్లాదేశ్

    పాకిస్తాన్ పై రెండు టెస్టుల సిరీస్ 2-0 తేడాతో గెలుచుకొని బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. ఈ జట్టు 45.8 విజయాల శాతంతో పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.. భారత జట్టుతో రెండు, వెస్టిండీస్ జట్టుతో రెండు, దక్షిణాఫ్రికా తో సొంత గడ్డపై రెండు టెస్టులు బంగ్లాదేశ్ ఆడాల్సి ఉంది. అయితే ఇందులో 5 మ్యాచ్ లను బంగ్లాదేశ్ గెలిస్తేనే అవకాశాలుంటాయి. కానీ అలా జరిగే అవకాశం కనిపించడం లేదు.

    శ్రీలంక జట్టు

    శ్రీలంక జట్టు ప్రస్తుతం 42.9 విజయాల శాతంతో పాయింట్లు పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్టులు ఆడనుంది. ఆస్ట్రేలియా తోనూ రెండు టెస్టులలో తలపడనుంది. దక్షిణాఫ్రికా తో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో 5 మ్యాచ్ లు గెలిస్తే శ్రీలంక జట్టుకు అవకాశాలుంటాయి. సంచలన ఆట తీరుతో ఇటీవల ఇంగ్లాండ్ జట్టును ఓడించిన శ్రీలంక.. ఈ సిరీస్ లలోనూ అదే ఫలితాన్ని కొనసాగిస్తుందని ఆ జట్టు అభిమానులు అంచనా వేస్తున్నారు.

    దక్షిణాఫ్రికా

    పాయింట్లు పట్టికలో 38.89% గెలుపులతో ఏడో స్థానంలో ఉంది. శ్రీలంక, పాకిస్తాన్ జట్లపై స్వదేశంలో రెండేసి టెస్టులు ఈ జట్టు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్లో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మూడు సిరీస్ లను క్లీన్ స్వీప్ చేస్తేనే దక్షిణాఫ్రికాకు ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఐదు మ్యాచ్ లు గెలిస్తేనే ఆ జట్టు ఫైనల్ రేసులో ఉంటుంది.