https://oktelugu.com/

Devineni Avinash : పదేళ్లలో వివాదాలు తప్పితే పదవులు దక్కలే.. అంతర్మధనంలో దేవినేని అవినాష్

కొందరు రాజకీయ దురదృష్టవంతులు ఉంటారు. వారు తీసుకునే నిర్ణయాలతో పదవులు దక్కవు సరి కదా.. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఈ విషయంలో దేవినేని అవినాష్ ఒక బాధితుడే.

Written By:
  • Dharma
  • , Updated On : September 12, 2024 / 11:39 AM IST

    Devineni Avinash

    Follow us on

    Devineni Avinash : రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అంటారు. కానీ యువనేత దేవినేని అవినాష్ అధికార టిడిపికి టార్గెట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. సుదీర్ఘకాలం ఆయన టిడిపిలోనే ఉన్నారు. ఆయన బంధువులు సైతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ టిడిపి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు కావడం గమనార్హం. అయినా సరే.. అవినాష్ కు ఈ పరిస్థితి ఏంటి ? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన ఆయన సరైన పదవి అందుకోలేదు. ఒక్కసారి కూడా పదవి చేపట్టలేదు. కానీ వివాదాలు, కేసులతో చేజేతులా రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం టిడిపి ప్రభుత్వం దేవినేని అవినాష్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది.

    * తండ్రి టిడిపి వ్యవస్థాపక సభ్యుడు
    తెలుగుదేశం పార్టీలో దేవినేని నెహ్రూ చాలా కాలం పని చేశారు. కానీ చంద్రబాబుతో విభేదించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెహ్రూ వారసుడిగా అవినాష్ కాంగ్రెస్పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే అవినాష్ ఎంట్రీ, రాష్ట్ర విభజన ఒకేసారి జరగడంతో.. ఆయన సరైన వేదిక లభించలేదు. 2014లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అటు తరువాత తండ్రి తో కలిసి తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2019లో చంద్రబాబు అవినాష్ పిలిచి మరి గుడివాడ టిక్కెట్ ఇచ్చారు. కానీ అవినాష్ ఓడిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చేసరికి ఆ పార్టీలోకి ఫిరాయించారు. ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దారుణ పరాజయం చవిచూశారు. అయితే వైసీపీలో ఓడిపోయిన మిగతా నేతలు ప్రశాంతంగా ఉంటే.. అవినాష్ మాత్రం ప్రతిక్షణం అరెస్టుల భయంతో గడుపుతున్నారు.

    * ఒకప్పుడు లోకేష్ టీం లోనే
    తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ టీంలో దేవినేని అవినాష్ ఉండేవారు. కానీ వైసీపీలోకి వచ్చాక అదే లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. జగన్ ను మెప్పించేందుకు అనరాని మాటలు అన్నారు. ఏ లోకేష్ టీంగా వ్యవహరించారో.. అదే లోకేష్ రెడ్ బుక్ లో చిక్కుకున్నారు అవినాష్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో.. నిందితులంతా అవినాష్ అనుచరులు కావడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ప్రస్తుతం ఈ కేసులో ముందస్తు బెయిల్ దక్కకపోవడంతో అజ్ఞాతంలో గడపాల్సిన అనివార్య పరిస్థితి ఆయనకు ఎదురైంది.

    * పదేళ్లలో మూడు పార్టీలు
    దాదాపు పది సంవత్సరాల్లో మూడు పార్టీలు తిరిగారు. ప్రతి చోట ఓటమి ఎదురైంది. గెలుపు దక్కే సమయంలో ప్రత్యర్థి పార్టీలో చేరారు. రాజకీయ మనుగడ కోసం ప్రత్యర్థులపై వ్యక్తిగతంగా విరుచుకుపడేవారు. అదే రాజకీయంగా వారికి ఇబ్బంది పెట్టింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ అవినాష్ అలా కాదు. అలా ఉండలేకపోయారు కూడా. పొలిటికల్ నిర్ణయాల విషయంలో తప్పటడుగులు వేశారు. వరుసగా తప్పులు చేశారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.ఏ వైసీపీనేతలకు లేని ఇబ్బందులను తనకు తాను తెచ్చుకున్నారు. మరి వాటి నుంచి ఎలా బయటపడతారో చూడాలి.