Actress Kadambari Jethwani : నటి కాదంబరి జెత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమెతో పాటు కుటుంబ సభ్యులను వైసీపీ నేత హింసించారు అన్నది ప్రధానంగా వచ్చిన ఆరోపణ. ఓ ఐపీఎస్ అధికారిని ప్రయోగించి ముంబై నుంచి విజయవాడ తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేసారన్నది గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉంది. ఇందులో ప్రధానంగా కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ కుమారుడు పేరు బయటకు వచ్చింది. నాడు ప్రభుత్వ పెద్దల్లో ఒకరు ఈ ఎపిసోడ్ లో ఉన్నారన్నది మరో ఆరోపణ. సహజంగానే కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుంది. ఇటువంటి తరుణంలో వైసిపి సరికొత్త కోణాన్ని బయట పెట్టే ప్రయత్నం చేసింది. సదరు నటి వ్యవహార శైలి అభ్యంతర కరంగా ఉంటుందన్నది వైసిపి అనుకూల వర్గాలు చేస్తున్న ప్రచారం. బడా పారిశ్రామికవేత్తలు, వారి పిల్లలను టార్గెట్ చేసుకొని ప్రేమ పేరిట మోసాలు చేస్తుందన్నది ఆమెపై ఆరోపణ. ఇందుకు సినీ రంగం పేరు చెప్పుకొని అడ్డగోలు వ్యవహారాలు సాగిస్తుంటారని ఆమెపై ప్రచారం మొదలుపెట్టారు. మరోవైపు ఆమె ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తనకు జరిగిన అన్యాయంపై స్పందించాలని కోరారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైసీపీ ప్రచారం మొదలుపెట్టడం విశేషం.
* వ్యక్తిగత వివాదాలే అధికం
రాష్ట్రంలో వైసిపి నేతల వ్యక్తిగత వ్యవహారాలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. తొలుత విజయసాయిరెడ్డి అంశం బయటికి వచ్చింది. పెద్ద రచ్చ నడిచింది. తరువాత ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ ఎపిసోడ్ బయటపడింది. రెండు వారాలపాటు మీడియాలో హైలెట్ అయింది. మూడోది అనంతబాబు వీడియో కాల్.. పెద్ద దుమారమే సాగింది. తరువాత నీదేనంటూ నాడు ప్రభుత్వ పెద్దల్లో ఒకరుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అక్కడకు కొద్ది రోజులకి ముంబై నటి వ్యవహారం బయటకు వచ్చింది.
* ఎల్లో మీడియా కథనాలతో
వాస్తవానికి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపైనే ఎల్లో మీడియా కథనాలు మొదలుపెట్టింది. తప్పకుండా ఏదో పరిణామం జరగబోతుందన్న అనుమానం బలపడింది. అందుకు తగ్గట్టుగానే దీనిపై ప్రచారం జరగడం.. పోలీసులు రంగంలోకి దిగడం.. సదరు నటి నేరుగా స్పందించడం.. న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం… ఇలా ఒక వ్యూహం ప్రకారం జరుగుతోందన్నది వైసీపీ అనుమానం. అందుకే వైసిపి అనుకూల వర్గాలు సదరు నటి వ్యవహారంపై దృష్టి పెట్టాయి.
* ట్రాప్ చేస్తారా
కాదంబరి జెత్వానీ బాలీవుడ్ సినిమాలతో పాటు సీరియల్లో నటించేవారు. ఆమె స్వతహాగా డాక్టర్ కూడా. ఇప్పటివరకు ఆమెపై 50 ట్రాప్ కేసులు ఉన్నాయన్నది వైసిపి అనుకూల వర్గాలు చేస్తున్న ప్రచారం. ప్రముఖులు, పారిశ్రామికవేత్తల కుటుంబాలకు చెందిన వారితో పరిచయం పెంచుకుంటారు. ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారుతుంది. దానిని ఆసరాగా చేసుకుని బ్లాక్ మెయిల్ కు దిగుతారు అన్నది ఆమెపై ఉన్న ఆరోపణ. అటువంటి ఆమెతో చేస్తున్న ఈ ప్రయత్నాలతో వ్యాపార వర్గాలు, పారిశ్రామికవేత్తలు ఏపీకి దూరమవుతారని వైసీపీకి అనుకూల మీడియా వర్గాలు కథనాలు ప్రచురిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ నడుస్తోంది.