AP Police: ఎమ్మెల్యే భార్య గారి సేవలో తరిస్తే పోలీసులకు ఇలానే ఉంటది మరి

ఇటీవల కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి వివాదాస్పదమవుతోంది. పార్టీకి లేనిపోని సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇంకో వైపు అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. పుట్టినరోజు వేడుకలకు హాజరైన పోలీసులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

Written By: Dharma, Updated On : August 29, 2024 4:51 pm

AP Police

Follow us on

AP Police: అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య బర్త్ డే చేసుకున్నారు. అందరు మాదిరిగానే పోలీసులకు ఆహ్వానాలు పంపారు.ఇంకేముంది పోలీసులు అక్కడకు వెళ్లారు. బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఆమె కేక్ కట్ చేసేటప్పుడు చుట్టూ నిలబడ్డారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు వారికి ఏకంగా నోటీసులు వచ్చాయి. దీనిపై సమాధానం చెప్పాలని పోలీస్ బాస్ నోటీసులు పంపారు. రెండు రోజుల కిందట చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ బర్త్ డే వేడుకలు జరిగాయి. అయితే ఆమెకు ఎలాంటి ప్రోటోకాల్ లేకపోయినా సీఐలు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొనడం పై విమర్శలు వచ్చాయి. వెంకాయమ్మకు ఎలాంటి అధికారిక హోదా లేదు. ఆమె కేవలం ఎమ్మెల్యే సతీమణి మాత్రమే. అలాంటప్పుడు పోలీసులు ఎలా వెళ్లారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకల వ్యవహారం వివాదాస్పదం కావడంతో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. పాల్గొన్న సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే సతీమణి పుట్టినరోజు వేడుకల్లో ఎలా పాల్గొంటారని? అధికారిక హోదా లేకున్నా ఎలా వెళతారని ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట టౌన్, రూరల్ సిఐలు సుబ్బ నాయుడు, రమేష్ తో పాటుగా ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణకు మెమోలు జారీ అయ్యాయి. చిలకలూరిపేట ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు సైతం నోటీసులు అందజేశారు. ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఎస్పీ శ్రీనివాసరావు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

* సీఎం ఆదేశాలు పాటించని వైనం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలను సైతం ఈ సమావేశానికి ఆహ్వానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారని.. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలన అందిద్దామని పిలుపునిచ్చారు. పాలనా వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దని కూడా సూచించారు. దూకుడు ప్రదర్శించవద్దని కూడా చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని.. ప్రభుత్వంపై విమర్శలు వచ్చే ఏ పని చేయవద్దని సూచించారు.

* ప్రారంభం నుంచి విమర్శలు
అయితే కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి కుటుంబ సభ్యుల తీరు మాత్రం విమర్శలకు గురిచేస్తోంది. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి భార్య పోలీస్ ఎస్కార్ట్ కోసం గొడవపడ్డారు. తనకు సైతం భద్రత కల్పించాలని కోరారు. ఇది వివాదాస్పదం అయ్యింది. అప్పట్లో సీఎం చంద్రబాబు స్పందించారు. ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఇటీవల శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఏకంగా మీడియానే బెదిరించారు. తాటతీస్తాను అంటూ హెచ్చరించారు. దీనిపై కూడా చంద్రబాబు స్పందించి సదరు ఎమ్మెల్యేకు హెచ్చరించారు.

* కుటుంబ సభ్యులపై ఫిర్యాదు
మరోవైపు కొందరు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల తీరుపై ఫిర్యాదులు వస్తున్నాయి. నేరుగా పోలీసులకు సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి భర్త తన ఆస్తిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఒక వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇది పెను సంచలనం అవుతోంది. అందుకే ఇటీవల మంత్రివర్గ సమావేశంలో సైతం సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. తాను ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అడ్డగోలుగా వ్యవహరించడం పై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు.

* ఇప్పుడు ఇలా
అయితే తాజాగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు వేడుకలు వివాదాస్పదం అయ్యాయి. అంత ఆర్భాటం చేయడం తగునా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పుడు వారి వ్యవహార శైలి కారణంగా పోలీసులు అడ్డంగా బుక్కయ్యారని.. సాధారణంగా పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానిస్తే వెళ్తుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటే పోలీసులు వెళ్లడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ విషయంలో పోలీసులు కంటే ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.