Pawan Kalyan
Pawan Kalyan: “చంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదు. ఇవాళ బీజేపీ అంటాడు. రేపు కాంగ్రెస్ అంటాడు” ఈ మాటలు అన్నది ఎవరో కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికారపక్షం, ప్రతిపక్షాలు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఏపీలో అభివృద్ధి బాగుందని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం అందుతుందని వైసీపీ అంటుంటే.. ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా దుర్మార్గ పాలన అందించారని టిడిపి, జనసేన ఆరోపిస్తున్నాయి.. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. అదేంటి జనసేన, టిడిపి కలిసి పొత్తు పెట్టుకున్నాయి కదా.. సీట్లు కూడా సర్దుబాటు చేసుకున్నాయి కదా.. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విమర్శిస్తారు? అనేదే కదా మీ ప్రశ్న.. దానికి సమాధానమే ఈ కథనం.
2014 ఎన్నికల్లో టిడిపికి జనసేన సపోర్ట్ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో బిజెపి కూడా ఈ రెండు పార్టీలతో కలిసి పోటీ చేసింది. 2014లో చంద్రబాబు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో బిజెపి ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత టిడిపి .. జనసేన, బిజెపితో విడిపోయింది. బిజెపిపై టీడీపీ యుద్ధం ప్రకటించింది.. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడింది. అమిత్ షా తిరుపతి వస్తే ఆయన కాన్వాయ్ పై రాళ్లు వేయించింది. ఇటు పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేసింది. వ్యక్తిగత జీవితాన్ని కూడా బజారులోకి లాగింది.. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో ఇలా ఎవరికి వారే పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది. టిడిపి 23 స్థానాలతోనే సరిపచ్చుకుంది. ఇక బిజెపి ఖాతా కూడా తెరవలేదు.
2019లో జరిగిన ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు ఓవర్గం మీడియా అంత ప్రయారిటీ ఇచ్చేది కాదు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. అయితే ఆ సమయంలో ఓ తమిళ మీడియా పవన్ కళ్యాణ్ తో ఇంటర్వ్యూ చేసింది. వ్యక్తిగత జీవితాన్ని నుంచి మొదలు పెడితే రాజకీయ ప్రయాణం వరకు అనేక ప్రశ్నలు అడిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో దోస్తీ గురించి పవన్ కళ్యాణ్ ను అడిగితే.. “చంద్రబాబు నాయుడుకి 2014లో మేము మద్దతు ఇచ్చాం. విజిత ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుందని నమ్మాను. అమరావతి రాజధాని అంటే ఒప్పుకున్నాం. రైతుల పక్షాన నేను పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు. పైగా నాపై విమర్శలు చేసింది. దీంతో మేం బయటికి వచ్చాం. అయినప్పటికీ వారు విమర్శలు ఆపలేదు. చంద్రబాబు నాయుడు విశ్వసనీయమైన మనిషి కాదు. రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తారని” పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. జనసేన, టిడిపి, బిజెపి సంయుక్తంగా పోటీ చేస్తున్నాయి కాబట్టి.. అప్పట్లో చంద్రబాబును విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ అనుకూల సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. సహజంగానే పవన్ కళ్యాణ్ కు రీచ్ ఎక్కువ కాబట్టి.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైసిపి పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలకు తగ్గట్టుగానే జనసేన నాయకులు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను, ఆయన విస్మరించిన హామీలను వీడియో రూపంలో కౌంటర్ గా పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి అటు వైసిపి, ఇటు జనసేన పోటాపోటీగా సోషల్ విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ఇలా ఉంటే.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏపీలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో..