Pawan Kalyan
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నట్టు? తెర వెనుక ఏం జరుగుతోంది? కూటమి అధికారంలోకి రాదని భయమా? పవర్ షేరింగ్ లేదనా? అదే జరిగితే కూటమికి ఓట్ల బదలాయింపు సక్రమంగా జరుగుతుందా? కాపులు మద్దతు తెలుపుతారా? ఇలా రకరకాల ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్లో బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు పవన్ రెండు చోట్ల అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అనూహ్యంగా ఎమ్మెల్యే తో పాటు ఎంపీగా పోటీ చేస్తారని తెలియడంతో రకరకాల ఈక్వేషన్స్ వెలుగులోకి వస్తున్నాయి. అటువంటప్పుడు పవన్ ఇస్తున్న హామీల మాట ఏమిటన్న ప్రశ్న బలంగా ఉత్పన్నమవుతోంది.
సమాజంలో మార్పు కోసమే తాను పార్టీ పెడుతున్నట్లు పవన్ ప్రకటించారు. బలమైన కాపు సామాజిక వర్గం తన వెంట నడుస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా రకాల హామీలు ఇచ్చారు. ప్రభుత్వములో జనసేన పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. యువతతో పాటు నిరుద్యోగులకు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. బీసీ వర్గాలతో పాటు ఇతర అణగారిన వర్గాలకు జనసేన ప్రభుత్వం అండగా నిలబడుతుందని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఈసారి పవన్ ద్వారా రాజ్యాధికారం దక్కుతుందని భావించింది. పవర్ షేరింగ్ లో భాగంగా పవన్ కు సీఎం పదవి దక్కుతుందని కూడా ఆశించారు. అయితే ఇప్పటికే లోకేష్ ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. వాటిని తప్పుపడుతూ కాపు సంఘం ప్రతినిధులు సైతం లేఖాస్త్రాలు సంధించారు. పొత్తులో భాగంగా తక్కువ సీట్లు తీసుకోవడానికి కూడా వారు తప్పుపట్టారు. కానీ తనకు ఎవరూ సలహాలు సూచనలు ఇవ్వాల్సిన పనిలేదని పవన్ తేల్చి చెప్పారు.
ఇప్పుడు అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానానికి పవన్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా నిర్ణయం తీసుకొని ఉంటే పర్వాలేదు కానీ.. మరి జనసేన తరఫున ఇచ్చిన హామీలకు ఎవరు జవాబుదారీ అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాదన్న భయమా? అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పవన్ కు రాష్ట్రంలో అధికారంలో వాటా లేకపోతే జనసైనికులు, కాపు వర్గం చంద్రబాబును సీఎం చేయడానికి పనిచేస్తుందా? చంద్రబాబు ఇచ్చే హామీలకు పవన్ బాధ్యత ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఎంపీగా గెలిచి.. కేంద్రమంత్రి కావడానికి పవన్ ఈ ప్రయత్నం చేస్తున్నారని
.. రాష్ట్రంలో చంద్రబాబుకు అధికారాన్ని అప్పగించేందుకు ఆరాటపడుతున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎన్నికల ముంగిట పవన్ కు ఇది చికాకు కలిగించే అంశమే. దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి.