Sharmila son political entry: ఏపీలో ( Andhra Pradesh) మరో వారసుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో చేరుతారా? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మనవడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనల్లుడు, పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం ప్రారంభమైంది. ఈరోజు ఆయన కర్నూలు ఉల్లి మార్కెట్ లో పర్యటించారు. తన తల్లి షర్మిల తో కలిసి రాజారెడ్డి మార్కెట్ కు వెళ్లారు. ఉల్లి ధరతో పాటు ఇతర వివరాలను రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు తర్వాత తల్లితోపాటు మార్కెట్ సందర్శనకు వెళ్లడం చర్చకు దారితీస్తోంది. దీంతో ఆయన త్వరలో రాజకీయ అరంగెట్రం చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ ప్రారంభం అయ్యింది.
కడప కోటగా..
1978లో వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అంతకంటే ముందే రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో స్థానిక రాజకీయాలు చేసేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ ప్రాంతంలో తనదైన ముద్ర చాటుకునేవారు. ఈ క్రమంలో వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు రాజశేఖర్ రెడ్డి. తదనంతరం రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చాలామంది చట్టసభలకు ఎన్నికయ్యే వారు. చాలామంది పదవులు అనుభవించారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు షర్మిల. సోదరుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జైలుకు వెళ్తే పార్టీ బాధ్యతలను తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర సైతం చేశారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తలెత్తిన విభేదాలతో సోదరుడు జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డామేజ్ చేయడంలో షర్మిల పాత్ర ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలమైన శక్తిగా మార్చాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే షర్మిల తనయుడు రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా చర్చ..
వాస్తవానికి గత కొద్దిరోజులుగా రాజారెడ్డి( Raja Reddy) పొలిటికల్ ఎంట్రీ పై ప్రచారం జరుగుతోంది. 1996 డిసెంబర్లో రాజారెడ్డి బ్రదర్ అనిల్, షర్మిల దంపతులకు జన్మించారు. హైదరాబాద్ ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. డాలస్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ డిగ్రీ అందుకున్నారు. అమెరికాలో ఓ ప్రముఖ కంపెనీలో కొద్ది రోజులు రాజారెడ్డి ఉద్యోగం చేశారు. చిన్నతనంలోనే మాస్టర్ ఆర్ట్స్ శిక్షణ పొందారు. గత ఏడాది అట్లూరి ప్రియతో రాజారెడ్డి వివాహం జరిగింది. అయితే నిశ్చితార్థ వివాహ వేడుకలకు హాజరైన జగన్మోహన్ రెడ్డి.. పెళ్లికి మాత్రం హాజరు కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిలకు పతాక స్థాయిలో విభేదాలు ఏర్పడడంతోనే.. కుమారుడు పొలిటికల్ ఎంట్రీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజారెడ్డి యాక్టివ్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.