AP Liquor Scam: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగినట్లు కూటమి ప్రభుత్వం అనుమానించింది. విచారణకు గాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ లోతైన విచారణ చేపట్టింది. దాదాపు 40 మంది వరకు నిందితులపై కేసు నమోదు చేసింది. ఓ 12 మంది అరెస్ట్ కూడా జరిగింది. కోర్టులో రెండుసార్లు చార్జిషీట్లు నమోదు చేసింది. ఈ క్రమంలో అంతిమ లబ్ధిదారుడు అరెస్టు ఉంటుందని తెగ ప్రచారం జరిగింది. అయితే ఒక వైపు విచారణ జరుగుతుండగానే.. సరైన ఆధారాలు చూపలేదని అప్పటి సీఎం ఓ అధికారి ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించింది. అయితే మిగతా నిందితుల్లో ఇప్పుడు ధీమా కనిపిస్తోంది. మిగతా వారికి తప్పకుండా బెయిల్ వస్తుందని వారంతా భావిస్తున్నారు. అయితే ఇదంతా కూటమి ప్రభుత్వం వ్యూహం అని మరికొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ముగ్గురు బెయిల్ పై విడుదలైన క్రమంలో వైసీపీ శ్రేణులు వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
వైసీపీ శ్రేణుల వీరంగం..
ఏసీబీ కోర్టు( ACB Court ) ఆదేశాల మేరకు మద్యం కుంభకోణం నిందితులు ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆదివారం ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే వారి విడుదల సందర్భంగా జైలు బయట ఉన్న వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించారు. వైసిపి ముఖ్య నాయకులు, వారి అనుచరులు, పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు, విద్యార్థి సంఘం నేతలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. అక్కడ జైలు సిబ్బంది ఆదేశాలను సైతం పాటించలేదు. రోడ్డుపై బైఠాయించి, జైలు తలుపులను బాదుతూ హంగామా చేశారు. ప్రధానంగా మాజీమంత్రి అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తలసీల రఘురాం తో పాటు అనుచరులు గలాటా సృష్టించారని ఆరోపణలు వస్తున్నాయి.
రెచ్చిపోయిన చెవిరెడ్డి..
కేవలం జైలు బయటే కాదు లోపల కూడా నిందితులు అరుపులతో హల్చల్ సృష్టించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇదే కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లోపల రెచ్చిపోయినట్లు తెలుస్తోంది. బెయిల్ వస్తే ఎందుకు వదలడం లేదు? మీకేం హక్కు ఉంది? కావాలని కుట్రలు చేస్తున్నారా? మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టం అని బెదిరించారు. గోవిందప్ప బాలాజీ తలను గోడకు కొట్టుకున్నట్లు నటించి అరుపులతో హోరెత్తించినట్లు ప్రచారం జరుగుతోంది. జైలు అధికారులు నచ్చజెప్పిన వినలేదని సమాచారం. జైలు లోపల నుంచి చెవిరెడ్డి తో పాటు ఇతర నిందితుల అరుపులు విని.. గేటు బయట ఉన్న వైసీపీ నేతలు సైతం రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.. ఏ ఎవడ్రా లోపల? మా వాళ్లను ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది? ఎందుకు లోపల నుంచి మా వాళ్ళు అరుస్తున్నారు? అంటూ జైలు తలుపులను బాదేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వంతో పాటు జైలు అధికారులను సైతం పురుష పదజాలంతో దూషించినట్లు సమాచారం. జైలు సూపరిండెంట్ ఇర్ఫాన్ మచిలీపట్నం నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వచ్చి విడుదల ప్రక్రియ చేపట్టారు. కానీ ఉదయం ఐదున్నర గంటలకు జైలు ప్రాంగణానికి చేరుకున్నారు వైసీపీ శ్రేణులు. ప్రస్తుతం వైసీపీ శ్రేణుల వ్యవహార శైలి జైలు వర్గాల్లో చర్చ జరుగుతోంది.