KCR Politics: కీలక నాయకులు వస్తున్నారు. నేరుగా పెద్ద సార్ ఉండే భవనంలోకి వెళ్ళిపోతున్నారు. గంటల తరబడి అక్కడే ఉంటున్నారు. రకరకాలుగా చర్చలు సాగిస్తున్నారు. వాస్తవానికి 2023 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఈ స్థాయిలో పోస్టుమార్టం జరగలేదు. ఇంత స్థాయిలో చర్చ జరగలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇంత ఇబ్బంది పడలేదు. కానీ భారత రాష్ట్ర సమితి తన చరిత్రలో తొలిసారిగా తీవ్రమైన ఉక్కపోతను ఎదుర్కొంటున్నది. ఇది ఎంతవరకు దారి తీస్తుంది.. ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ప్రస్తుతానికైతే సమాధానం దొరకని ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కేంద్ర దర్యాప్తు బృందం విచారణ.. వంటి విషయాలపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కేంద్ర దర్యాప్తు బృందం ఈ వ్యవహారంలోకి ప్రవేశిస్తే ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి.. ఎలా ప్రజలకు చెప్పాలి.. అనే విషయాలపై నాయకులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఫారిన్ నుంచి వచ్చిన సిద్దిపేట ఎమ్మెల్యే కూడా నేరుగా ఎరవల్లి వెళ్ళిపోయారు. ఇదే ఇతర పథకంపై కేసీఆర్ తో సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్చల్లో కేసీఆర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు.. వాటికి అనుగుణంగా భారత రాష్ట్ర సమితి ఎలాంటి అడుగులు వేస్తుంది.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.. ఇప్పటికే గులాబీ పార్టీ కరపత్రం కాలేశ్వరం ఎత్తిపోతల పథకం మీద ప్రతిరోజు పేజీలకు పేజీలు వార్తలు డంప్ చేస్తోంది. అసలు ఆ ఎత్తిపోతల పథకంలో అవినీతి జరగలేదని.. దానివల్లే తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో పంట పండుతోందని కథనాలను పబ్లిష్ చేస్తోంది.
ఆ ఎన్నిక కూడా దూరం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా భారత రాష్ట్ర సమితి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఎన్డీఏ అభ్యర్థి వైపు, ఇండియా కూటమి అభ్యర్థివైపు ఉండాల్సిన అవసరం లేదని గులాబీ అధినేత కేసిఆర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గులాబీ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. తీవ్ర సమాలోచనల తర్వాత గులాబీ పార్టీ అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ.. కేవలం ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయం మాత్రమే బయటికి వచ్చింది. మిగతా అన్నింటిలోనూ గులాబీ పార్టీ అధినేత గోప్యత ను పాటిస్తున్నారు.