Pawan Kalyan: కూటమి అభ్యర్థుల ప్రకటన కొలిక్కి వచ్చేసరికి.. అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. టిడిపి తో పాటు జనసేనలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ రెండు పార్టీలతో పోల్చితే బిజెపిలో మాత్రం ప్రశాంత వాతావరణం ఉంది. బిజెపిలో కీలకమైన నేతలు సోము వీర్రాజు, జివిఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలకు టిక్కెట్లు దక్కకపోయినా.. వారి నుంచి ఆ స్థాయిలో అసమ్మతి స్వరం వినిపించడం లేదు. కానీ జనసేనలో మాత్రం పరిస్థితికొంచెం ప్రమాదకరంగా ఉంది. అటు వైసీపీ సైతం జనసేన లోని అసంతృప్త నాయకులను పార్టీలోకి రప్పించే ఏర్పాట్లు చేస్తోంది. పవన్ కళ్యాణ్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. కానీ పవన్ లైట్ తీసుకుంటున్నారు. తనను అభిమానించే జన సైనికులు తన వెంటే ఉంటాడని భావిస్తున్నారు.
జనసేన ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న చాలామంది నాయకులకు ఈసారి టిక్కెట్లు దక్కలేదు.అందులో పార్టీ కీలక నేతగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. దశాబ్ద సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను. నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. కనీసం పిలిచి మాట్లాడలేదంటూ తన బాధను వ్యక్తం చేశారు.ఇప్పటికే అనకాపల్లి జనసేన నేత పరుచూరి భాస్కరరావు పార్టీ నుంచి బయటికి వెళ్లిపోయారు. బొలిశెట్టి సత్యనారాయణ పరిస్థితి ఏంటన్నది తెలియడం లేదు.
తాజాగా ఓ కీలక నేత జనసేన నుంచి బయటకు వెళ్లిపోనున్నట్లు తెలుస్తోంది. జనసేన కీలక నేతల్లో పితాని బాలకృష్ణ ఒకరు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. గత ఎన్నికల్లో ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేశారు.ఈ ఎన్నికల్లో కూడా ముమ్మిడివరం టికెట్ బాలకృష్ణకే నని పవన్ హామీ ఇచ్చారు. దీంతో ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం మొదలుపెట్టారు.
అయితే అక్కడ టిడిపి అభ్యర్థిగా దాట్ల బుచ్చిబాబు పేరును ప్రకటించారు. దీంతో బాలకృష్ణ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎమ్మెల్యే తో పాటు మంత్రి పదవి ఇస్తానని పవన్ ఆశ చూపారని.. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అసంతృప్తి స్వరాన్ని గుర్తించిన వైసీపీ అలెర్ట్ అయింది. పార్టీలోకి రప్పించేందుకు యత్నాలు చేస్తోంది. ఇప్పటికే బాలకృష్ణతో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చర్చలు జరిపారని.. ఈనెల 30న జగన్ సమక్షంలో బాలకృష్ణ వైసిపి లో చేరనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే జనసేనలో అసంతృప్త నేతలను వైసీపీలో చేర్పించేందుకు గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. మరి పవన్ వాటిని అధిగమిస్తాడా? లైట్ తీసుకుంటాడా? అన్నది చూడాలి.