Homeఆంధ్రప్రదేశ్‌Dharmana Prasadha Rao :  ప్రత్యక్ష రాజకీయాలకు వైసీపీ సీనియర్ నేత గుడ్ బై.. ప్రజలు...

Dharmana Prasadha Rao :  ప్రత్యక్ష రాజకీయాలకు వైసీపీ సీనియర్ నేత గుడ్ బై.. ప్రజలు దారుణంగా ఓడించడంతో మనస్థాపం

Dharmana Prasadha Rao : ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు. యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేసి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎక్కువ కాలం మంత్రిగా కూడా వ్యవహరించారు. అటువంటి నేత రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఒక సామాన్య సర్పంచ్ చేతిలో 52వేల ఓట్ల తేడాతో ఓడిపోవడంతో మనస్థాపానికి గురయ్యారు. అందుకే ప్రజా జీవితం నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏపీలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన. ప్రజా సమస్యలను క్షుణ్ణంగా వివరించడం, ఎలాంటి విషయాన్నైనా సామాన్యులకు సైతం తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం, లోతైన విషయ పరిజ్ఞానం ఆయన బలాలు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో అడుగుపెట్టిన ధర్మాన ప్రత్యేక పరిస్థితులతో వైసిపిలో చేరారు. ఉమ్మడి ఏపీతో పాటు నవ్యాంధ్రలో సైతం మంత్రిగా వ్యవహరించారు.ఆరుగురు ముఖ్యమంత్రుల వద్ద ఆయన మంత్రిగా పనిచేయడం విశేషం. మూడుసార్లు రెవెన్యూ శాఖ నిర్వర్తించారు. 1991లో నేదురుమల్లి జనార్ధన రెడ్డి క్యాబినెట్లో ధర్మాన తొలిసారి మంత్రిగా పనిచేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్యాబినెట్ లోనూ ఆయన మంత్రిగా సేవలు అందించారు. తిరిగి 2004లో వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి బాధ్యతలు స్వీకరించారు. 2009లో వైయస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో సైతం చోటు దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన నేతగా ధర్మాన గుర్తింపు పొందారు.

సర్పంచ్ గా ప్రస్థానం ప్రారంభించి
శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబుగాం ఆయన స్వగ్రామం. 1981లో మబుగాం సర్పంచ్ గా విజయం సాధించారు. యువజన కాంగ్రెస్ లో చేరి అంచలంచెలుగా ఎదిగారు. 1985లో తొలిసారిగా నరసన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. టిడిపి అభ్యర్థి సింహ ప్రభాకర్ రావు చేతిలో ఓడిపోయారు. 1987లో పోలాకి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1994 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 1999 లో మాత్రం గెలిచారు. 2003లో ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆయనకు నరసన్నపేట నియోజకవర్గాన్ని విడిచిపెట్టి..శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నారు ధర్మాన.2004, 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి విజయం సాధించారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

 అనూహ్యంగా వైసీపీలోకి
వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ధర్మాన ప్రసాదరావు మంత్రిగా ఉన్నారు.దీంతో నరసన్నపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ధర్మాన కృష్ణ దాస్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా మరో సోదరుడు రాందాస్ ను బరిలోదించారు ప్రసాదరావు. ఆ ఎన్నికల్లో కృష్ణదాస్ గెలిచారు. అయితే 2014 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైసీపీలో చేరారు ధర్మాన ప్రసాదరావు. కానీ శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి పోటీ చేసిన కృష్ణదాస్ ఇద్దరూ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేసిన ఇద్దరూ గెలిచారు. అయితే ధర్మాన ప్రసాదరావును కాదని కృష్ణదాస్ ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. దీంతో ప్రసాదరావు అసంతృప్తికి గురయ్యారు. పార్టీలో పెద్దగా యాక్టివ్ గా పని చేయడం మానేశారు. దీంతో మంత్రివర్గ విస్తరణలో కృష్ణ దాసుని తప్పించి.. ధర్మాన ప్రసాదరావు కు మంత్రి పదవి ఇచ్చారు జగన్. కానీ అయిష్టంగానే పదవి తీసుకున్నారు ప్రసాదరావు.

 దారుణ పరాజయం
ఎన్నికల్లో వైసీపీ తరఫున మరోసారి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు ప్రసాదరావు. ఈసారి తనను తప్పించి కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరారు. కానీ జగన్ అందుకు అంగీకరించలేదు. టిడిపి అభ్యర్థిగా ఓ సామాన్య సర్పంచ్ గొండు శంకర్ ను బరిలోదించగా.. ఆయన విజయం సాధించారు. జిల్లాలోని రికార్డు స్థాయిలో 52,000 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు ధర్మాన. ప్రత్యక్ష రాజకీయాలను విడిచి పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే ఓ సీనియర్ రాజకీయ నేత ప్రస్థానం భారీ ఓటమితో ముగిసినట్లు అయ్యింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version