https://oktelugu.com/

IAS officer Sree Laxmi : ప్రజాధనంతో పార్క్.. పేరు మాత్రం ఐఏఎస్ అధికారిణి తండ్రిది!

గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఆ నలుగురు మాత్రమే లబ్ధి పొందగలిగారు. కొంతమంది అస్మదీయ అధికారులతో పాలన నడిపించారు జగన్. అడ్డగోలు నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. మూల్యం చెల్లించుకున్నారు. అటువంటి అధికారులంతా ఇప్పుడు విఆర్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Written By:
  • Dharma
  • , Updated On : August 1, 2024 9:45 am
    Follow us on

    IAS officer sree Laxmi : జగన్ అక్రమాస్తుల కేసుల్లో ప్రధానంగా వినిపించిన పేర్లలో ఐఏఎస్ శ్రీలక్ష్మి ఒకరు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ అక్రమాస్తులు కూడబెట్టారని.. ఇందులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పాత్ర ఉందని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల పాటు ఆమె జైలు జీవితం సైతం అనుభవించారు. అనంతరం బెయిల్ పై వచ్చిన ఆమె తెలంగాణ క్యాడర్లో ఎలాట్ అయ్యారు. 2019లో జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ క్యాడర్ కు వచ్చారు. జగన్ సైతం ప్రభుత్వంలో ఆమెకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. రెండుసార్లు పదోన్నతి కల్పించి కీలకమైన పురపాలక శాఖను అప్పగించారు. అయితే ఆమె తన అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా టిడిపిని టార్గెట్ చేసుకొని చాలా రకాల నిర్ణయాలు తీసుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. అందుకే ఆ మధ్యన సీఎం గా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. ఆమె శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదని ప్రచారం జరిగింది. వైసిపి హయాంలో ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులు ఒత్తిన 18 మంది ఐఏఎస్ అధికారులపై వేటు వేసిన సంగతి తెలిసిందే. వారిని వీఆర్లోకి పంపారు. అయితే ఇప్పుడు పురపాలక శాఖలో కీలక అధికారిగా ఉంటూ శ్రీలక్ష్మి చేసిన వ్యవహారాలు బయటపడుతున్నాయి.మచిలీపట్నంలో రూ. 2.18 కోట్లతో నిర్మించిన పార్కుకు తన తండ్రి పేరు పెట్టుకున్నారు. తానే స్వయంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఇంతకీ ఆయన తండ్రి ఓ సాధారణ రైల్వే ఉద్యోగి కావడం విశేషం.

    * ఆ నిధులతో పార్కు నిర్మాణం
    మునిసిపల్ శాఖ పరిధిలోని రాష్ట్ర గ్రీన్, బ్యూటిఫికేషన్ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో పార్కులు నిర్మించారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో కూడా పార్క్ ఏర్పాటు చేయాలని సంకల్పించారు.అది శ్రీలక్ష్మి స్వస్థలం కావడంతో ఇట్టే అనుమతులు లభించాయి.టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయించారు.ఇలా నిర్మిస్తున్న పార్కులకు మహనీయుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది.అయితే ఇక్కడే శ్రీలక్ష్మి ఆలోచన చేశారు. తన తండ్రి స్మారకంగా పార్కు పేరును మార్చాలని అధికారులను సూచించడం,అందుకు వారు సమ్మతించడం జరిగిపోయాయి. ఈ ఏడాది జనవరి 24న శ్రీలక్ష్మి అదే పార్కును ప్రారంభించడం విశేషం.

    * ఆయన సాధారణ రైల్వే ఉద్యోగి
    శ్రీలక్ష్మి తండ్రి నాగేశ్వరరావు రైల్వేలో పని చేసేవారు. ఇంజనీరింగ్ గా పదవీ విరమణ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలామంది పదవి విరమణ చేస్తుంటారు. అందులో నాగేశ్వరరావు కూడా ఒకరు. మచిలీపట్నంలో ఎంతోమంది మహనీయులు ఉన్నారు.వారందరి పేర్లు కాదని కేవలం పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి తండ్రి కావడంతో ఆయన పేరు పెట్టేందుకు అధికారులు అత్యుత్సాహం చూపించారు. ఈ పార్కు నిర్మాణానికి రాష్ట్ర గ్రీన్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నిధుల నుంచి రెండు కోట్లు, మచిలీపట్నం నగరపాలక సంస్థ నుంచి 18 లక్షలు ఖర్చు చేశారు.

    * విగ్రహం సైతం ఏర్పాటు
    పార్కులో శ్రీలక్ష్మి తండ్రి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దానిపై కుటుంబ సభ్యుల పేర్లు,నాగేశ్వరరావు ఉద్యోగ ప్రస్థానాన్ని కూడా పొందుపరిచారు.దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆయన పనిచేశారు. మచిలీపట్నంలో రైల్వే అభివృద్ధికి ఆయన పెద్దగా సహకరించిన దాఖలాలు కూడా లేవు. కానీ ఆయన కేవలం పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తండ్రి కావడంతో.. యుద్ధ ప్రాతిపదికన పార్కు పనులను పూర్తి చేశారు. ఆమెతోనే ప్రారంభించి.. ఆమె ప్రాపకం పొందగలిగారు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా, జైలు జీవితం అనుభవించినా శ్రీలక్ష్మి వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. అటు విగ్రహం ఏర్పాటుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చినా.. ఇంతవరకు చెల్లించలేదని తెలుస్తోంది.