YCP: వైసీపీ ఎంపీలు బిజెపిలో చేరతారా? లోక్సభ సభ్యులతో పాటు రాజ్యసభ సభ్యులు జంప్ చేస్తారా? జగన్ పంపిస్తారా? లేకుంటే తమకు తాముగా వారు వెళ్ళిపోతారా? ఇప్పుడు ఇదే బలమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయింది. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిన చంద్రబాబు బిజెపి అగ్రనేతలను టార్గెట్ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు. జాతీయస్థాయిలో బిజెపి సొంతంగానే అధికారంలోకి వచ్చింది. దీంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది. ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కు ఎదురయింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. కేవలం నాలుగు ఎంపీ స్థానాలకు పరిమితం అయ్యారు. దీంతో చంద్రబాబు మాదిరిగా జగన్ వ్యవహరిస్తారా? వైసీపీ ఎంపీలను బిజెపిలోకి పంపిస్తారా? అన్న చర్చ అయితే జరుగుతోంది.
ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి 11 మంది ఎంపీలు ఉన్నారు.తెలుగుదేశం పార్టీకి ఎవరూ లేరు. అటు బిజెపికి సైతం ఆశించిన స్థాయిలో రాజ్యసభ సభ్యులు లేరు. మరోవైపు ఇండియా కూటమి పట్టు బిగిస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు తప్పకుండా జగన్ ను వెంటాడుతారు. పాత కేసులను తిరగదోడుతారు. ఆ విషయం జగన్ కు తెలియంది కాదు. జగన్ తో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సైతం కేసులను ఎదుర్కొంటున్నారు. దీంతో జగన్ సూచనతో విజయసాయిరెడ్డి బిజెపిలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ జగన్ చెప్పకపోయినా విజయ్ సాయి రెడ్డి మాత్రం బిజెపిలోకి వెళ్లేందుకు శత విధాలా ప్రయత్నాలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు లోక్ సభ సభ్యులు ఎన్నికయ్యారు. కడప నుంచి వైయస్ అవినాష్ రెడ్డి, రాజంపేట నుంచి మిధున్ రెడ్డి, తిరుపతి నుంచి గురుమూర్తి, అరకు నుంచి డాక్టర్ గుమ్మ తనుజారాణి ఎంపీలుగా విజయం సాధించారు. అందులో తొలి ముగ్గురు జగన్ కు అత్యంత వీర విధేయులు. జగన్ గీసిన గీత దాటరు. కానీ డాక్టర్ తనూజారాణి గురించి పెద్దగా తెలియదు. అయితే అవసరాల రీత్యా ఈ ఎంపీలు జగన్ వద్ద ఉంటారన్న గ్యారెంటీ లేదు. ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇప్పటివరకు వైసీపీ అధికారంలోకి ఉండడంతో ఆయనకు ఎటువంటి ఇబ్బందులు రాలేదు.. ఇప్పుడు టిడిపి అధికారంలోకి రావడంతో ఆయన్ను వెంటాడుతారు. అందుకే ఆయన బిజెపిలో చేరతారని టాక్ అప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ చంద్రబాబు కేంద్రంలో కీలకంగా వ్యవహరించనుండడంతో.. ఆయన అనుమతి లేకుండా బిజెపి ఈ ఎంపీలను తీసుకుంటుందా? అన్నది ఒక అనుమానం.