Vemireddy Prabhakar Reddy: వైసీపీలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎపిసోడ్ హల్ చల్ సృష్టిస్తోంది. ఆయన్ను నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు. కానీ ఆయన మాత్రం పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మనసు మార్చుకున్నారు. టిడిపి నుంచి కానీ, బిజెపి నుంచి కానీ వేంరెడ్డి బరిలో దిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఆయన జగన్ ఢిల్లీ పర్యటనలో కనిపించకుండా పోయారు. ఏకంగా కుటుంబ సభ్యులతో విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో వైసిపి హై కమాండ్ వేంరెడ్డి పై ఆశలు వదులుకుంది. నెల్లూరుకు ప్రత్యామ్నాయ అభ్యర్థిని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ పై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నెల్లూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ వైసిపి ఇన్చార్జిగా జగన్ నియమించారు. ఆదాల స్థానంలో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే మూడు అసెంబ్లీ స్థానాలను మార్చితేనే తాను పోటీ చేస్తారని వేంరెడ్డి కండిషన్ పెట్టారు. దీనికి జగన్ ఒప్పుకోవడంతో పోటీకి సిద్ధపడ్డారు. వేంరెడ్డి కోరిక మేరకు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను తప్పించారు. కానీ ఆయన అనుచరుడుకే ఇంచార్జ్ పదవి కట్టబెట్టారు. అనిల్ కు నరసరావుపేట ఎంపీ సీటును కేటాయించారు. ఇది వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి మింగుడు పడని విషయం.
వాస్తవానికి నెల్లూరు సిటీ స్థానాన్ని వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్యకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ జగన్ అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడికి కట్టబెట్టడంతో వేంరెడ్డి ఆగ్రహానికి గురయ్యారు. పైగా అనిల్ కుమార్ యాదవ్ అన్ని వేదికల వద్ద వేమిరెడ్డిని తిడుతుండడంతో.. ఇక పార్టీలో ఉండడం మంచిది కాదని భావించి బయటకు వెళ్లిపోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా వైసీపీ నాయకత్వానికి వేంరెడ్డి అందుబాటులో లేరు. వేంరెడ్డి ఢిల్లీలో ఉండడంతో సీఎం ఓ కార్యాలయం నుంచి ఆయనకు సమాచారం వెళ్ళింది. సీఎం ఢిల్లీ వస్తున్నారు.. మీ ఇంటికి వస్తారని చెప్పడంతో.. తాను విదేశాలకు వెళ్తున్నానని చెప్పి.. వేంరెడ్డి కుటుంబ సభ్యులతో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
వేంరెడ్డి టిడిపిలో కానీ.
. బిజెపిలో కానీ చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక దాంట్లో చేరి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. తాను ఎంపీగా పోటీ చేసినా మిగతా నేతలు సహకరించే స్థితిలో లేరని.. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ వెన్నుపోటు పొడుస్తారని వేంరెడ్డి అనుమానిస్తున్నారు. పైగా అనిల్ కుమార్ యాదవ్ కు జగన్ ప్రాధాన్యమిస్తుండడం వేం రెడ్డికి మింగుడు పడడం లేదు. ఇప్పటివరకు పార్టీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచినా… తన విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు. పైగా నెల్లూరు రాజకీయ పరిణామాలు శరవేగంగా మారాయి. వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అందుకే వైసిపి కంటే టిడిపి శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ పొత్తు కుదిరితే.. బిజెపి నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.