Kenya: ఊపిరి పీల్చడం, నిద్రపోవడం, నీరు తాగటం, ఆకలి తీర్చుకోవడం.. ఇవన్నీ మనిషి సాధారణ లక్షణాలు.. వీటిని త్యజించమని ఏ మతమూ చెప్పదు. ఏ దేవుడూ బోధించడు. కులం కూడు పెడుతుందని, మతం మనుగడ కొనసాగిస్తుందని ఏ మత గ్రంథమూ చెప్పదు. కానీ కొంతమంది కులం పేరుతో రెచ్చగొడతారు.. ఆ మంటల్లో వారు చలికాచుకుంటారు. మతం పేరుతో నానా యాగీ సృష్టిస్తారు. తమ పబ్బం గడుపుకుంటారు. చివరికి సాటి మనుషులను కూడా బలి చేసేందుకు వెనుకాడరు. అలాంటి ఉదంతమే ఇతడిది. కెన్యాలోని పాల్ నెంగే మెకేంజీ అనే క్రిస్టియన్ కల్ట్ లీడర్ పాల్పడిన మహా దారుణం కనీ వినీ ఎరుగనిది. ఇంతకీ ఇతడు ఏం చేశాడంటే?
ప్రాణం పోయడం దైవత్వం అవుతుంది. అదే ప్రాణం తీయడం రాక్షసత్వం అనిపించుకుంటుంది. కెన్యాలోనిపాల్ నెంగే మెకేంజీ అనే క్రిస్టియన్ కల్ట్ లీడర్ చేసింది అదే. పాల్ క్రైస్తవ మత బోధకుడిగా పనిచేస్తుంటాడు. క్రీస్తు బోధనలను వినిపించేవాడు.. కెన్యాలోని మారుమూల ప్రాంతాల్లో పేదలను లక్ష్యంగా చేసుకొని బైబిల్ లోని పాఠాలు చెప్పేవాడు. క్రీస్తు బోధనలను వినిపించడం వరకైతే బాగానే ఉండేది. పాల్ నెంగే మెకేంజీ ఒక అడుగు ముందుకు వేసి చిత్ర విచిత్రమైన పనులు చేసేవాడు. ఏసుక్రీస్తును చేరుకోవడం వల్ల మనం చేసిన పాపాలు మొత్తం తొలగిపోతాయని.. క్రైస్తవులు దేవుడి వద్దకు చేరుకుంటేనే పరలోకాన్ని పొందుతారని చెప్పేవాడు. అసలే పేదలు.. ఆపై నిరక్షరాస్యులు.. దీంతో పాల్ నెంగే మెకేంజీ చెప్పే మాటలు నమ్మేవారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని పాల్ ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. వారిలో మతం అనే మత్తును చొప్పించి తను ఏం చెబితే అది చేసేలాగా మార్చుకున్నాడు.
పాల్ నెంగే మెకేంజీ తన 29 మంది అనుచరులతో కెన్యా పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ మతాన్ని మరింత విస్తరించే క్రమంలో రకరకాల కార్యక్రమాలు చేపట్టేవాడు. దేవుడిని చేరుకోవాలి అంటే ఆకలితో అలమటించాలి.. అప్పుడే దేవుడు మనల్ని కరుణిస్తాడు అని కెన్యా పరిసర ప్రాంతాల్లోని అమాయకులకు చెప్పడం మొదలుపెట్టాడు. పాల్ నెంగే మెకేంజీ చెప్పిన మాటలు నిజమని నమ్మిన ఆ కెన్యా ప్రజలు అలాగే ఉపవాసం ఉండడం మొదలుపెట్టారు. కనీసం పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అసలే కెన్యా.. ఎండలు విపరీతంగా ఉంటాయి. దీనికి పాల్ నెంగే మెకేంజీ నిబంధనలు తోడు కావడంతో వారు అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో పాల్ నెంగే మెకేంజీ అనుచరులు అక్కడ చిన్నారులను గొంతు నులిమి చంపడం ప్రారంభించారు.. దాదాపు చాలామంది చిన్నారులను చంపారని తెలుస్తోంది. ఈ ఉదంతంపై అక్కడి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. కెన్యాలోని ఎనిమిది వందల ఎకరాల అటవీ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించగా అందులో 191 మంది చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. గత ఏడాదిగా పాల్ నెంగే మెకేంజీ , అతడి అనుచరులు ఈ ఘోరానికి పాల్పడుతున్నారని పోలీస్ అధికారులు తమ విచారణలో గుర్తించారు. ఇప్పటివరకు 191 మంది చిన్నారుల మృతదేహాలను గుర్తించిన అధికారులు.. ఇంకా ఎంతమంది చనిపోయి ఉంటారు? అనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ సంఘటన కెన్యా వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాల్ నెంగే మెకేంజీ చేసిన నిర్వాకం పట్ల ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. క్రీస్తు బోధనలు వివరించే క్రమంలో ఇలా ప్రాణాలు తీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిన్నారుల ప్రాణాలు తీస్తే దేవుడు కరుణిస్తాడా అంటూ
పాల్ నెంగే మెకేంజీ వైఖరిని దుయ్యపడుతున్నారు..పాల్ నెంగే మెకేంజీ, అనుచరులు.. చిన్నారులు ప్రతిఘటించకపోవడంతోనే వారి ప్రాణాలు తీశారని తెలుస్తోంది.