Indukuri Raghu Raju: వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలోకి వెళ్తున్న నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయట. అయితే కొంతమంది ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండేందుకు టిడిపిలో చేరుతున్నారు. మరికొందరు కేసుల భయంతో వెళ్తున్నారు. కానీ అలా చేరుతున్న వారిని టిడిపి ఓన్ చేసుకోవడం లేదట. అటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. వైసీపీలో ఆయన కీలక నేత. అందుకే అప్పట్లో స్థానిక సంస్థల కోటా కింద ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఆయన ఎస్.కోట నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ జగన్ సిటింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు. అయితే రఘురాజు కోపంతో తన కుటుంబ సభ్యులతో పాటు తన వర్గీయులను టిడిపిలోకి పంపించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఘన విజయానికి అవసరమైన సాయాన్ని అందించారు. అయితే ఇప్పుడు అవసరం తీరాక టిడిపి తనను పట్టించుకోవడంలేదని రఘురాజు తెగ బాధపడుతున్నారు.
* కోర్టులో ఉపశమనం పొంది..
వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయడంతో రఘురాజు పై అనర్హత వేటు వేశారు మండలి చైర్మన్. వైసీపీ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఆయన చర్యలకు ఉపక్రమించారు. రఘు రాజు పై అనర్హత వేటు పడడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే ఇంతలో రఘురాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందారు. మరో నాలుగు సంవత్సరాల పాటు ఆయన ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు. అయితే టిడిపి విజయానికి కృషి చేశానని.. తనకు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ముద్ర దక్కుతుందని రఘురాజు భావించారు. కానీ ఇప్పుడు టిడిపిలో ఆయనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదు. అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. దీంతో అనవసరంగా వైసీపీని విభేదించి వచ్చానని ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.
* ఎన్నెన్నో హామీలు
టిడిపిలో చేరితే అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు సమాచారం. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఆ సమయంలో ఎస్ .కోట నియోజకవర్గం రెండుగా విభజన కానుంది. ఆ సమయంలో తప్పకుండా సర్దుబాటు చేస్తామని రఘు రాజుకు టిడిపి హై కమాండ్ హామీ ఇచ్చింది. అప్పటివరకు అధికార పార్టీ ఎమ్మెల్సీగా చూసుకుంటామని.. రఘురాజు భార్యకు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా నియమిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ తీరా చేరాక రఘురాజుకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆయన భార్యకు విలువ లేని నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అనవసరంగా వైసీపీ నుంచి బయటపడ్డానని.. అక్కడే కొనసాగి.. కొద్దిరోజుల తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకుంటే బాగుండేదని రఘురాజు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన పరిస్థితి చూస్తుంటే మున్ముందు కీలక రాజకీయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.