https://oktelugu.com/

Amaravati: అమరావతికి ప్రైవేట్ సంస్థల క్యూ.. భూములు కేటాయింపు పై విన్నపాలు!

అమరావతి మరోసారి మార్మోగుతోంది. దేశీయ, విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయి. తమకు భూములు కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది సిఆర్డిఏ.

Written By:
  • Dharma
  • , Updated On : December 12, 2024 / 11:25 AM IST

    Amaravati Capital(1)

    Follow us on

    Amaravati: కూటమి సర్కార్ దూకుడుగా ఉంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభించాలని భావిస్తోంది. 21 నిర్మాణాలకు సంబంధించి పాలన అనుమతులు కూడా తీసుకుంది. ఇంకోవైపు కేంద్రం ప్రకటించిన 15000 కోట్ల రూపాయల సాయం ప్రపంచ బ్యాంకు నుంచి అందనుంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని భావిస్తోంది. గతం మాదిరిగా సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయింది. ఈ మేరకు కేంద్రం అనుమతి కోసం నివేదికలు కూడా పంపింది. అయితే ఒక వైపు ప్రభుత్వ భవనాల నిర్మాణంతో పాటు కేంద్ర ప్రాజెక్టులను సైతం ప్రారంభించాలని చూస్తోంది. ఇప్పటికే రోడ్డు, రవాణాకు సంబంధించి కేంద్రం కీలక ప్రాజెక్టులను అమరావతికి కేటాయించింది. ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణం తో పాటు జాతీయ రహదారులను సైతం నిర్మించాలని భావిస్తోంది. ఈ పనులన్నీ ఏకకాలంలో జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది. మరోవైపు వివిధ సంస్థలకు అమరావతిలో కేటాయించిన భూములకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇటీవల బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ప్రత్యేకంగా భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. ఇంకో వైపు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు అమరావతికి క్యూ కడుతుండడం విశేషం.

    * అప్పట్లో జాప్యం..
    2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించింది చంద్రబాబు సర్కార్. నాడు చాలా రకాల దేశీయ, విదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను అమరావతిలో ప్రారంభించాలని చూశాయి. వాటికి భూములను కేటాయించింది నాటి చంద్రబాబు సర్కార్. అయితే అమరావతి నిర్మాణ పనుల్లో జాప్యం, అమరావతి రాజధాని స్థిరంగా కొనసాగుతుందన్న అభిప్రాయంతో చాలా ప్రైవేటు సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించడంలో జాప్యం చేశాయి. ఇంతలో ప్రభుత్వం మారడం.. అమరావతిని పట్టించుకోకపోవడంతో ఆ సంస్థలు ఇటువైపు వచ్చేందుకు పెద్దగా మొగ్గు చూపలేదు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటనతో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సదరు సంస్థలు ఇష్టపడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడం.. అమరావతికి ప్రాధాన్యత ఇవ్వడం.. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని భావించడం.. తదితర కారణాలతో సదరు సంస్థలు ముందుకు వచ్చి కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

    * పర్యాటక సంస్థలు
    ముఖ్యంగా పర్యాటక రంగాలకు సంబంధించి నిర్మాణాలు అమరావతిలో జరగనున్నాయి. దేశంలో ఆతిధ్యరంగంలో దిగ్గజ సంస్థలుగా పేరొందిన తాజ్ ,ఒబెరాయ్ హోటళ్ళు అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం శుభ పరిణామం. ప్రపంచ ప్రఖ్యాత అధునాతన వస్తువులతో ఆతిధ్య రంగానికి తలమానికంగా నిలుస్తాయి ఈ రెండు హోటళ్ళు. ఎప్పటికీ ప్రఖ్యాత విద్యాసంస్థలు, వైద్య సంస్థలు కూడా అమరావతికి క్యూ కడుతున్నాయి. వాస్తవానికి తాజ్ గ్రూపునకు విశాఖలో ఒక హోటల్ ఉంది. అదే తరహా హోటల్ అమరావతిలో ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకుగాను 10 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు సమాచారం. ఒబేరాయ్ హోటల్కు సైతం అదే తరహా కేటాయింపులు చేస్తారని తెలుస్తోంది. నిర్మాణరంగంలో రహేజా గ్రూప్ ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఆ సంస్థ సైతం ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోరింది. మరోవైపు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కూడా తమకు మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఆయా సంస్థలకు భూ కేటాయింపులపై దృష్టి పెట్టింది సి ఆర్ డి ఏ.