EVM Tampering : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి దారుణ పరాజయం చవిచూసింది. వై నాట్ 175 అన్న నిదానంతో ఎన్నికల బరిలో దిగింది. కానీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. చాలా జిల్లాల్లో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కనీసం బోణీ కూడా తెరవలేదు. చాలామంది కీలక నాయకులు సైతం ఓడిపోయారు. భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు వైసిపి నేతలపై గెలిచారు. అయితే ఇంతటి పరాజయంతో వైసిపి నేతలు ఒక రకమైన అనుమానం పెరిగింది. తమకు మెజారిటీ ఉన్న ప్రాంతాల్లో సైతం ఓట్లు తగ్గడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీని వెనుక ఈవీఎం కుట్ర దాగి ఉందన్నది వైసీపీ నేతల నుంచి వస్తున్న మాట. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు డిమాండ్ చేశారు. అనుమానంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించాలని కోరారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకు అవసరమైన ఖర్చు భరించేందుకు కూడా సిద్ధపడ్డారు. ఎలక్షన్ కమిషన్ కు ఆ నగదు మొత్తాన్ని కట్టారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, విజయనగరానికి చెందిన బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే చిన్న వెంకట అప్పలనాయుడు తదితరులు రీకౌంటింగ్ ను కోరారు. దీంతో న్యాయస్థానం స్పందించింది. వివి ప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని తీర్పు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఈసీ వ్యవహరించింది. వివి ప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించకుండా మాక్ పోలింగ్ నిర్వహించేందుకు వీలుగా.. టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ఈసీ జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలినేని ఉత్తర్వులు రద్దు చేయాలని మరోసారి కోర్టును ఆశ్రయించారు.
* వైసిపి న్యాయపోరాటం
అయితే ఇప్పుడు వైసిపి న్యాయపోరాటానికి సిద్ధపడింది. ఈరోజు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ను వైసీపీ నేతలు కలిశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల సరళి పై వచ్చిన అనుమానాలను నివృత్తి చేయాలని సీఈవో ను కోరారు. పోలింగ్ శాతం విషయంలో ఎన్నికల తర్వాత ఈ సి వేర్వేరు ప్రకటనలు చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంత శాతం పోలింగ్ నమోదయింది. ఒక్కో అభ్యర్థికి ఎన్నో ఓట్లు వచ్చాయి అనే విషయాలను ఈసి వెల్లడించని విషయాన్ని వైసిపి నేతలు ప్రస్తావిస్తున్నారు. ఫారం 20 సమాచారాన్ని వెంటనే అప్లోడ్ చేయాలని కోరుతున్నారు.
* సోషల్ మీడియాలో రచ్చ
ఫలితాలు వచ్చిన నాటి నుంచే ఈవీఎంలపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ప్రచారం నడిచింది. ఈవీఎంలపై తొలుత అనుమానం వ్యక్తం చేసింది చంద్రబాబేనని వైసీపీ నేతలు గుర్తు చేశారు. ఈవీఎంలలో ఎన్ని ఓట్లు పడ్డాయో వివి ప్యాట్ లో కూడా అన్నే చూపించాలని.. కానీ ఏపీలో మాత్రం చాలా తేడాలు కనిపిస్తున్నాయని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. వివి ప్యాట్లు లెక్కించకుండా.. కేవలం మాక్ పోలింగ్ చేసి చూపిస్తున్నారని.. అది సరికాదని తాజాగా వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
* దేశవ్యాప్తంగా అనుమానాలు
దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమి ఎదురైన ప్రతి పార్టీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తోంది. గతంలో 151 స్థానాల్లో వైసిపి విజయం సాధించింది.అప్పట్లో కూడాఈవీఎంలపై చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు అనుమానించారు.ఇప్పుడు కూడా టిడిపి కూటమి ఘన విజయం సాధించడంతో వైసీపీ నేతలు అదే తరహా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అందుకే ప్రజలు లైట్ తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నది వైసీపీ ఆరోపణ. అయితే జాతీయస్థాయిలో బిజెపికి సీట్లు తగ్గాయి. అందుకే ఈవీఎం ట్యాంపరింగ్ పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో మాత్రం పెద్ద రచ్చే నడుస్తోంది.