YCP Vs TDP: ఇటీవల ఏపీ ఎన్నికలకు ముందు ప్రచారం జోరుగా సాగింది. కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలను ఘనంగా ప్రచారం చేశారు. కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలా మారిపోయిందని ఆరోపించారు. ఏపీ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడేమో నీతి ఆయోగ్ నివేదికను పక్కలో పెట్టుకొని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. అప్పు తీసుకొస్తే తప్ప పూట గడిచే పరిస్థితి లేదని.. ఇలాంటి అప్పుడు పథకాలు అమలు చేసే అవకాశం లేదని చంద్రబాబు కుండబద్దలు కొట్టారు. దీనంతటికీ జగన్ పరిపాలనలోని వైఫల్యమే కారణమని స్పష్టం చేశారు. మొత్తంగా సూపర్ సిక్స్ పథకాలను డైవర్ట్ చేశారు. కానీ ఇక్కడే వైసీపీ నాయకులు అలర్ట్ అయిపోయారు. 11 స్థానాలు గెలుచుకొని తీవ్రంగా నిరాశలో కూరుకుపోయిన వారికి ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల డైవర్షన్ సరికొత్త మార్గంగా నిలుస్తోంది. దీని ఆధారంగానే వైసీపీ నాయకులు సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలుపెట్టారు.
గల్లా పట్టుకొని నిలదీయండి
ట్విట్టర్ లో Jagan Anna connects అనే ఐడిలో వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం ఓ వ్యక్తి ఎన్నికల ప్రచారానికి ముందు నారా లోకేష్ యూట్యూబర్ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. “రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సూపర్ సిక్స్ పథకాలకు రూపకల్పన చేశాం. ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చు ఎంత అవుతుంది? ఇవన్నీ లెక్కలు వేసుకున్న తర్వాతే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ప్రజలకు చెప్పాం. దాని ఆధారంగానే ఎన్నికల ప్రచారం చేస్తున్నా. కచ్చితంగా మేము గెలుస్తున్నాం. ఒకవేళ రేపటినాడు ఈ పథకాలు అమలు చేయకపోతే ప్రజలు నా కాలర్ పట్టుకుని గట్టిగా నిలదీయవచ్చని” లోకేష్ వ్యాఖ్యానించారు. అయితే నాడు లోకేష్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను ఇప్పుడు వైసీపీ నాయకులు తెగ ప్రచారం చేస్తున్నారు.” సూపర్ సిక్స్ పథకాలకు చంద్రబాబు నాయుడు మంగళం పాడేశారు. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్లే ఈ పథకాలు అమలు చేయలేకపోతున్నామని ప్రకటించారు. అయితే ఎన్నికలకు ముందు లోకేష్ లాంటి నాయకులు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే గల్లాగుంజి అడగాలని చెప్పారు. ఇప్పుడు ప్రజలు నారా లోకేష్ కనిపిస్తే గల్లాగుంజి పథకాల గురించి అడగాలి. సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటినుంచి అమలు చేస్తారో చెప్పమని నిలదీయాలని” వైసిపి నాయకులు తమ సోషల్ మీడియా ప్రచారంలో చెబుతున్నారు. మరి దీనిపై టిడిపి నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలారా..
. @naralokesh చెప్పినట్టు , టీడీపీ నాయకులు బయట కనపడితే చొక్క పట్టుకొని సూపర్ సిక్స్ ఎక్కడ అని నిలదీయండి.#AndhraPradesh #YSRCP #YSJagan #JaganannaConnects pic.twitter.com/aT6LBxBoaP
— Jagananna Connects (@JaganannaCNCTS) January 29, 2025