Vijayasai Reddy : విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి అవుతారా?అది ఎలా సాధ్యం? ఆయన వైసీపీ ఎంపీ కదా? వైసిపి ఎన్ డి ఏ లో చేరలేదు కదా? మరి ఎలా ఆయన కేంద్ర మంత్రి అవుతారు? తరచూ నేనే కేంద్రమంత్రి అయితే అన్నమాట ఎందుకు వాడుతున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీలో కీలక నేత. అందులో తప్పులేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి ఆయన అవసరం ఉంది. జగన్ కు అత్యంత అవసరం కూడా. ఎన్నికలకు ముందు సాయన్న ముసలాడయ్యాడు.. అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తన ప్యాలెస్ కు రప్పించుకున్నారు జగన్. పార్టీకి ఘోర పరాజయం ఎదురు కావడంతో అదే సాయన్న ఇప్పుడు అవసరం గా మారారు. అందుకే ఆయనను ఉత్తరాంధ్ర రీజినల్ ఇంచార్జ్ పదవి ఇచ్చారు. మళ్లీ విశాఖకు పంపించారు. ఢిల్లీలో కూడా ప్రాధాన్యత తగ్గించేశారు. అక్కడ తిరుపతి ఎంపీ గురుమూర్తికి విజయసాయిరెడ్డి ప్లేసును కట్టబెట్టారు. అప్పటినుంచి విజయసాయిరెడ్డి లో ఒక రకమైన ఆందోళన అయితే ఉంది. విజయసాయిరెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం సాగింది. జగన్ ఆదేశాల మేరకు ఆయన అలా చేయనున్నట్లు అప్పట్లో టాక్ నడిచింది. ఒకవేళ జగన్ పంపించినా.. తనకు తాను బిజెపిలోకి వెళ్లినా విజయసాయి రెడ్డి కేంద్రమంత్రి అయ్యే ఛాన్స్ ఎలా ఉంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
* తరచూ అదే మాట
నేనే గానీ కేంద్ర మంత్రి అయితే ఏపీని అగ్రగామిగా నిలుపుతానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేస్తానని, రైల్వే జోన్ తెచ్చేస్తానని, పోలవరం ప్రాజెక్టు కట్టిస్తానని లేనిపోని మాటలు చెబుతున్నారు. తన ట్విట్టర్ ఖాతాకు పని చెబుతున్నారు. అయితే ఆయన గత ఐదేళ్లుగా కేంద్రమంత్రికి మించి అధికారాన్ని వెలగబెట్టారు. 22 మంది ఎంపీలతో పాటు పదిమందికి పైగా రాజ్యసభ సభ్యులకు సారధ్యం వహించారు. ప్రధానితో పేరు పెట్టు పిలుచుకునేంత చనువు ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే ఒక్కటంటే ఒక్క రాష్ట్ర ప్రయోజనం గురించి ఏనాడూ ప్రస్తావించలేదు. ఆయన చేసినదంతా జగన్ ప్రయోజనాల కోసమే. ఇది పక్కన పెడితే విజయసాయి ఎలా కేంద్రమంత్రి అవుతారన్నది ఇప్పుడు ప్రశ్న.
* చంద్రబాబును జగన్ ఫాలో అవుతారా?
చంద్రబాబు మాదిరిగా జగన్ ఒక ముందు చూపుతో వ్యవహరిస్తారన్న ప్రచారం ఒకటి ఉంది. అందులో భాగంగా విజయసాయిరెడ్డి తో పాటు కొంతమంది రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపుతారు. బిజెపిలో వీరు యాక్టివ్ అవుతారు. తెలుగుదేశం పార్టీ నుంచి బిజెపిని బయట పెట్టేందుకు ప్రయత్నిస్తారు. టిడిపి ప్లేసును వైసిపి భర్తీ చేసేలా వ్యవహరిస్తారు. అయితే అందుకు మార్గం ఉందా? అంటే అది లేదు. ఎందుకంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. టిడిపి సపోర్ట్ లేనిదే మోడీ సర్కార్ నడవడం కష్టం. ఏపీకి సంబంధించి ప్రతి రాజకీయ నిర్ణయం చంద్రబాబుకు చెప్పి చేయాల్సిందే. అటువంటప్పుడు విజయసాయిరెడ్డి బిజెపిలో చేరుతానంటే చంద్రబాబు అడ్డుకోరా? ఈ చిన్న పాటి లాజిక్ మిస్సయిన విజయసాయిరెడ్డి కేంద్రమంత్రి నవ్వుతానంటూ చిన్నపిల్లాడి మాదిరిగా వ్యవహరించడం ఏంటని విశ్లేషకులు ఎదురు ప్రశ్న వేస్తున్నారు.