Newzealand vs India : గోల్డెన్ & డైమండ్ డక్ అవుట్ అంటే ఏమిటి? ఈ అపవాదును మూట గట్టుకున్న మొదటి ప్లేయర్ ఎవరు?

ముంబై వేదికగా జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో, మూడో రోజు ఆటలో భారత జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 147 పరుగుల లక్ష్యాన్ని చేధించాలి.

Written By: Mahi, Updated On : November 4, 2024 10:52 am

Akashdeep

Follow us on

Newzealand vs India: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు పేలవమైన ఆటతీరును సగటు క్రికెట్ క్రీడాభిమాని ఊహించి ఉండడు. ఇందులో టీమ్ ఇండియా మూడు మ్యాచ్‌ల్లోనూ దాదాపు ఏకపక్ష ఓటమిని ఎదుర్కొంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ టెస్టు సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో, మూడో రోజు ఆటలో భారత జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో 147 పరుగుల లక్ష్యాన్ని చేధించాలి. కానీ ఇందులో జట్టు మొత్తం 121 పరుగులకే కుప్పకూలింది. 25 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ సిరీస్‌లో టీం ఇండియా ఎన్నో అవమానకరమైన రికార్డులను నమోదు చేసింది. ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ బాల్‌తో కాకుండా బ్యాట్‌తో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో గతంలో ఏ ప్లేయర్ కూడా ఈ చెత్త రికార్డును నమోదు చేయలేదు. బెంగాల్‌కు చెందిన ఆకాష్ దీప్ 2019లో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. రాష్ట్ర జట్టు కోసం మూడు ఫార్మాట్లలోనూ రాణించాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో బౌలింగ్‌లో 23.58 సగటు కలిగి ఉన్నాడు. 104 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 2019-20 సీజన్‌లో గుజరాత్‌పై 60 పరుగులకు ఆరు వికెట్లు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకట్టుకున్నాడు. బెంగాల్ జట్టు 2020, 2023లో రంజీ ట్రోఫీ ఫైనల్స్‌ కు చేరడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆకాష్ దీప్ ఆటతీరును గుర్తించి ఐపీఎల్- 2022 సీజన్ కోసం తీసుకున్నది.

ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ ఏ జట్టు తరపున అద్భుతంగా రాణించాడు. 11 వికెట్లు తీసి18.72 సగటుతో జాతీయ జట్టులో ఎంపికయ్యేందుకు దారి వేసుకున్నాడు. చివరికి రాంచీలో టెస్ట్ మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2022 సీజన్ లో ఏడు మ్యాచ్‌లలో ఆరు వికెట్లతో తీశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి సీజన్‌లో 45 పరుగులకు 3 వికెట్లు తీశాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో గోల్డెన్ డక్ & డైమండ్ డక్ సాధించిన తొలి ప్లేయర్ గా ఆకాశ్ దీప్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసేందుకు మైదానంలోకి వచ్చిన ఆకాశ్‌దీప్‌ ఒక్క బాల్ కూడా ఆడకుండానే రనౌట్‌ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతనికి తొలి బంతిని ఎదుర్కొనే అవకాశం రాగా బౌల్డ్ అయ్యాడు.

ఇలా మొదటి ఇన్నింగ్స్‌లో డైమండ్ డక్‌కి ఔట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ ఔటయ్యాడు. ఒక బ్యాట్స్‌మెన్ ఒక్క బంతి కూడా ఆడకుండా అవుట్ అయ్యి పెవిలియన్‌కు చేరితే దానిని డైమండ్ డక్ అని పిలుస్తారు. ఒక బ్యాట్స్‌మన్ తన ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే ఔట్ అయితే దానిని గోల్డెన్ డక్ అంటారు. దీంతో ఒకే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఆకాశ్‌దీప్‌ నిలిచాడు.