Jagan And Sharmila: పెద్ద రాజకీయ కుటుంబాల్లో ఇప్పుడు విభేదాల పర్వం నడుస్తోంది. తెలంగాణ( Telangana) నుంచి బీహార్ వరకు ప్రతి రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతలకు తోబుట్టువులే ఎదురెళ్లుతున్నారు. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డిని గత నాలుగేళ్లుగా తీవ్రంగా విభేదిస్తున్నారు సోదరి షర్మిల. తెలంగాణలో ఇటీవల కేటీఆర్ పై తిరుగుబాటు చేశారు సోదరి కవిత. బీహార్లో సైతం అదే పరిస్థితి ఉంది. అయితే గతంలోనూ చాలా రాజకీయ పార్టీల్లో ఇటువంటి పరిణామాలు జరిగాయి. కానీ తదనంతరం పరిణామాల క్రమంలో మళ్లీ అంతా కలిసి పోయారు. ఇప్పుడు ఏపీలోనూ వైయస్ జగన్మోహన్ రెడ్డితో సోదరి షర్మిల కలిసి పోయారు అనే వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైయస్సార్ కాంగ్రెస్ నేత ఒకరు దానిపై మాట్లాడారు. ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
* తండ్రి మరణం తర్వాత..
రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పిల్లలిద్దరూ ఎంతో అన్యోన్యంగా, ప్రేమతో ఉండేవారు. రాజశేఖర్ రెడ్డి మరణించాక ఆ బంధం మరింత దృఢంగా మారింది. ఒకానొక దశలో సోదరుడు జగన్మోహన్ రెడ్డి కోసం షర్మిల గట్టిగానే నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినప్పుడు షర్మిల కాంగ్రెస్ అధినాయకత్వంపై చాలా రకాల ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు అండగా నిలిచి పాదయాత్ర చేశారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చేందుకు అహర్నిశలు శ్రమించారు. అధికారంలోకి వచ్చేక వ్యక్తిగత, కుటుంబ వైరంతో జగన్మోహన్ రెడ్డితో విభేదించారు. రాజకీయ శత్రుత్వం పెంచుకున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేసే వరకు విడిచిపెట్టలేదు షర్మిల.
* రాజకీయ ప్రత్యర్థిగా మారి..
తెలంగాణలో తన తండ్రి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు షర్మిల( Y S Sharmila ). తన కుటుంబానికి కలిసి వచ్చిన పాదయాత్ర ఫార్ములాను ఎంచుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే ఆ ప్రయత్నాలు ఏవి వర్కౌట్ కాలేదు. చివరకు తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ బాధ్యతలను తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయాల వెనుక సోదరుడు జగన్మోహన్ రెడ్డి పై ఆగ్రహం ఉండేది. అలా గత మూడేళ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి జనాల్లో పలుచన చేయగలిగారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులను మేలు చేయగలిగారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు షర్మిల. పోనీ షర్మిల రాజకీయంగా ఎదిగారు అంటే అదీ లేదు. తన అన్న రాజకీయ పతనాన్ని కోరుకున్నారు. అది జరిగిన షర్మిల లో మార్పు రాలేదు. అయితే ఇటీవల వైయస్ కుటుంబ అభిమానులు వారిద్దరి మధ్య రాజీ చేశారన్న వార్తలు వచ్చాయి.
* వైసిపి నేత సతీష్ రెడ్డి ప్రకటన..
తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత సతీష్ రెడ్డి( Satish Reddy ). పులివెందులకు చెందిన సతీష్ రెడ్డి చాలాకాలం టిడిపిలో ఉంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సతీష్ రెడ్డికి ఎంతగానో ప్రాధాన్యమిస్తున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కూడా అంటారు. అటువంటి వ్యక్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరూ కలిసి పోతారని.. వారి మధ్య విభేదాలు సమసిపోతాయని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇటీవల షర్మిల జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు తగ్గించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో లో లోపల ఏదో జరుగుతోందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?