Homeఆంధ్రప్రదేశ్‌Krishna District: రక్తం కక్కించి మరీ కొట్టారు.. ఎస్టి బాలికపై వైసీపీ నేత దారుణం

Krishna District: రక్తం కక్కించి మరీ కొట్టారు.. ఎస్టి బాలికపై వైసీపీ నేత దారుణం

Krishna District: వైసిపి నేతల అరాచకాలకు అడ్డే లేకుండా పోతోంది. వీరికి పోలీస్ రాజ్యం తోడవుతుంది. దీంతో పేద ప్రజలు బాధితులుగా మారుతున్నారు. అణగారిన వర్గాల వారు వీరి ఆగడాలకు, ఆకృత్యాలకు బలవుతున్నారు. దొంగతనం నెపం మోపి ఓ దళిత బాలిక తో పాటు ఇద్దరు మహిళలను దారుణంగా హింసించారు. ఈ ఘటన కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కే. కొత్తపాలెంలో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం కొత్తపాలెం లో గ్రామ వైసిపి కన్వీనర్ మత్తి రాజాబాబు ఇంట్లో ఈ నెల 20న వేడుకలు జరిగాయి. గ్రామానికి చెందిన ఎస్టీ బాలికకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. అయితే రాజాబాబు ఇంట్లో మహిళ చెవి దిద్దులు కనిపించకుండా పోయాయి. ఆ మరుసటి రోజు బాలిక ఇంటికి వెళ్లిన రాజాబాబు ఆమెపై దొంగతనం నెపం మోపి ఇంట్లో ఉన్న వస్తువులను చెదురు మదురు చేశాడు. అయినా చెవి దిద్దులు దొరకలేదు. దీంతో ఆ బాలికను బైక్ పై తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడే ఉన్న సచివాలయ మహిళా పోలీస్ సమక్షంలోనే దారుణంగా కొట్టాడు. దీంతో ఆ బాలిక రక్తం వాంతులు చేసుకుంది. అయినా కనికరించలేదు. దీంతో వారు చెప్పిన విధంగా సదరు బాలిక మాట్లాడగా.. వీడియోని చిత్రీకరించారు. అనంతరం మోపిదేవి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే అక్కడ కూడా ఎస్సై పద్మ సదరు బాలికను దారుణంగా కొట్టింది. బాలిక పిన్ని తో పాటు మరో మహిళను సైతం హింసించారు. కాళ్లతో పాటు వీపుపై తన్నడంతో బొబ్బలు కట్టాయి. రేపు చెవి దిద్దులు తీసుకురండి అంటూ వారిని పంపించేశారు. అయితే ఆ మరుసటి రోజు ఆ ముగ్గురు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. కానీ ఎస్సై అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజు రావాలని చెప్పి సిబ్బంది పంపించేశారు.

కనీసం నడవలేని స్థితిలో ఆ బాలికతో పాటు ఇద్దరు మహిళలు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో బాలిక తాత అతి కష్టం మీద వారిని ప్రభుత్వాసుపత్రి వద్దకు తీసుకెళ్లాడు. కానీ అక్కడ వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది వెనుకడుగు వేశారు. అలాగని ఉదయం పోలీస్ స్టేషన్ కి వెళ్తే మళ్లీ చిత్ర హింసలు పెడతారని భయపడి ఆసుపత్రి ప్రాంగణంలోని మదర్ థెరిసా విగ్రహం వద్ద దీనంగా కూర్చున్నారు. ఈ విషయాన్ని కొందరు చిత్రీకరించి వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై ప్రజాగ్రహం వ్యక్తం కావడంతో పోలీసుల స్పందించారు. నిందితుడు రాజాబాబు పై కేసులు నమోదు చేశారు. మహిళా ఎస్సై పై శాఖా పరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version